Hydra DRF Staff Protest: హైడ్రా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీతాల తగ్గింపు, సిబ్బందిపై అన్యాయం జరిగిందన్న ఆరోపణలతో.. డీఆర్ఎఫ్ సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో సిబ్బంది కార్యాలయం వద్ద చేరుకోవడంతో.. పరిస్థితి గందరగోళంగా మారింది.
కార్యాలయం ముట్టడి – భారీ పోలీసు బందోబస్తు
సిబ్బంది ఆందోళన కారణంగా కార్యాలయం వాతావరణం.. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి భారీగా మోహరించారు. కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు పలు నినాదాలు చేస్తూ.. తమ డిమాండ్లను అధికారులకు వినిపించాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే.. విధులకు హాజరుకామని స్పష్టంచేశారు.
జీతాల తగ్గింపుపై ఆగ్రహం
డీఆర్ఎఫ్ సిబ్బంది మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తాం. అగ్ని ప్రమాదం, వరదలు, ప్రమాదాలు, సహజ విపత్తులు ఏవైనా జరిగినా ముందుగా మేమే చేరతాం. కానీ ఇప్పుడు మా జీతాలు తగ్గించారు. ఇది మాకు తీరని అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొన్ని నెలలుగా జీతాలు ఆలస్యంగా రావడమే కాకుండా, కొత్తగా తగ్గింపులు అమలు చేయడంతో కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా మారిందని తెలిపారు.
అత్యవసర సేవలు స్తంభన
సిబ్బంది విధులను బహిష్కరించడంతో.. నగరంలో అత్యవసర సేవలు తాత్కాలికంగా స్తంభించిపోయాయి.
అధికారుల స్పందన
ఈ పరిణామంపై అధికారులు వెంటనే స్పందించారు. ఆందోళనలో ఉన్న సిబ్బందితో చర్చలు జరిపేందుకు సీనియర్ అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు.
ఉద్యోగుల హెచ్చరిక
సిబ్బంది మాత్రం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మా జీతాలు మళ్లీ పూర్వ స్థితికి రాకపోతే, మాకు న్యాయం జరగకపోతే ఇకపై విధులకు హాజరుకాలేం. ఎలాంటి విపత్తు వచ్చినా మేము స్పందించము అని స్పష్టం చేశారు.
Also Read: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఏడుగురు
హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనతో నగర అత్యవసర సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ సమస్యను ప్రభుత్వం, అధికారులు అత్యవసరంగా పరిష్కరించకపోతే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.