Student Suicide: భువనగిరి జిల్లా తూప్రాన్‌పేటలోని.. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ నాలుగో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు.
హాస్టల్ జీవితం మొదటి రోజే విషాదాంతం
ఈ విద్యార్థిని శనివారం హాస్టల్ లో చేరింది. కానీ, రెండో రోజు నుంచే ఆమె మనోవేదనకు లోనైనట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు తనను బలవంతంగా హాస్టల్‌లో ఉంచారని, ఇది తనకు ఇష్టం లేదని తోటి విద్యార్థులకు తెలిపినట్లు సమాచారం. హాస్టల్ జీవితం, పేరెంట్స్ కి దూరంగా రావడంతో.. ఆమెపై తీవ్ర మానసిక ప్రభావం చూపినట్టు.. పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
తల్లిదండ్రుల నిర్ణయం.. చిన్నారి పై మానసిక భారం
తల్లిదండ్రుల ఆశయాలు ఎలా ఉండాలి? పిల్లల మనసు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు.. ఎంతటి ప్రభావం చూపుతాయో ఈ ఘటన ఉదాహరణ. విద్యార్ధినికి హాస్టల్ జీవితం కొత్తది. తల్లిదండ్రుల ప్రేమ, అనురాగం, మధ్య పెరిగిన చిన్నారి ఒక్కసారిగా పరాయి చోట, తోటివారితో సమన్వయం చేసుకోలేకపోయింది. ఒంటరితనానికి తోడు ఇంటికి తిరిగి తీసుకెళ్లమన్న చిన్నారి మనసును.. పెద్దలు పట్టించుకోకపోవడమే ఈ విషాదానికి కారణంగా భావిస్తున్నారు.
పోలీసులు చేపట్టిన దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది, స్కూల్ టీచర్లను విచారించేందుకు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆత్మహత్యకు గల మౌలిక కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: యమునా నది ఒడ్డున ఏం జరిగింది? ఢిల్లీ వర్సిటీ విద్యార్థి స్నేహా మృతదేహం, షాక్‌లో పేరెంట్స్
సమాజం ఎదుర్కొంటున్న ఆవేదన
ఈ సంఘటన బాలల మనస్తత్వాన్ని, వారి మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. విద్య అనేది భయంతో కాకుండా ప్రేమతో అందించాల్సిన అంశం. తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దకుండా, వారి అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నారుల మానసిక స్థితిని సమర్థవంతంగా అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది వ్యవహరించాలి.