Hyderabad News: టెక్నాలజీ వచ్చాక చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. మరికొందరు జీవితాలు నాశనం అయ్యాయి. విచ్చల విడిగా ఫోన్లు వాడడం, రకరకాల యాప్స్ బారిన పడి సంపాదించినంతా పొగొట్టుకున్నారు ఇంకొందరు. ఇక యువతీయువకుల గురించి చెప్పనక్కర్లేదు. డేటింగ్ యాప్ ఉచ్చులో పడి సర్వం పొగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ శివారు ప్రాంతం ఆల్వాల్‌లో వెలుగు చూసింది.
హైదరాబాద్ శివారు అల్వాల్‌లో నివసించే ఓ యువతి కొన్నాళ్ల కిందట ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రైవేట్‌గా ఓ క్లినిక్ పెట్టుకుంది. క్లినిక్‌కు పేషెంట్స్ బాగానే వస్తున్నారు. అదే సమయంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల సుబ్రహ్మణ్యంతో ఈ డాక్టర్‌కు పరిచయం ఏర్పడింది. అది కూడా డేటింగ్ యాప్ ద్వారానే.
ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. చివరకు ప్రేమకు దారితీసింది. ఇంతవరకు బాగానే మేనేజ్ చేస్తూ వచ్చాడు సుబ్రహ్మణ్యం. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించారు. ఇక్కడి నుంచి అసలు గేమ్ మొదలుపెట్టాడు సుబ్రహ్మణ్యం. తన ఫ్యామిలీ ఆర్థిక సమస్యల్లో ఉందని, డాక్టర్‌ని నమ్మించాడు.
నిజమేనని నమ్మేసింది. ఎలాగూ కలిసి జీవితాన్ని పంచుకోవాలని భావించడం తో పలు దఫాలుగా సాయం చేసింది. ఆమె నుంచి ఏకంగా రూ.25 లక్షలు తీసుకున్నాడు. డాక్టర్ తల్లి కూడా నిందితుడి మాయమాటలను నమ్మేసింది. ఆమె కూడా 15 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. నిందితుడికి రావాల్సిన మొత్తం వచ్చేసింది.
ALSO READ: ఫైనాన్స్ కంపెనీలో భారీ మోసం.. 2 కిలోల బంగారంతో పరార్
పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు సుబ్రహ్మణ్యం. సన్నిహితంగా ఉండే ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఫోన్ నెంబర్ మార్చడంతో తాను మోసపోయానని ఆ డాక్టర్ తెలుసుకుంది. మంగళవారం రాత్రి అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు.