Vanshika Saini: భారతీయ విద్యార్థి వంశిక సైనీ మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. కెనడాలోని ఒట్టావా బీచ్‌లో శవమై కనిపించింది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. కెనడాలోని భారత హైకమిషన్ కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది. ఇంతకీ వంశిక సైనీ ఎవరు? ఎక్కడ? కాస్త లోతుగా డీటేల్స్‌లోకి వెళ్తే..
పంజాబ్ ఆప్ నేత దేవిందర్ సింగ్ కూతురు వంశిక సైనీ. వయస్సు 21 ఏళ్లు. రెండున్నరేళ్ల కిందట కెనడాలో వెళ్లింది. అక్కడ వైద్య విభాగంలో డిగ్రీ పూర్తి చేసింది. ఈనెల (ఏప్రిల్ )25న అద్దె ఇంటి కోసం సెర్చింగ్ మొదలు పెట్టింది. అంతకుముందు కొద్దిసేపటి ముందు తన తండ్రితో మాట్లాడింది వంశికసైనీ.
ఈక్రమంలో బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆ రాత్రి దాదాపు 11. 40 గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మరుసటి రోజు ఆమెకు కీలక పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. రెండు రోజులుగా ఫోన్ కాల్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె ఫ్రెండ్స్‌తో మాట్లాడారు. వాళ్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏప్రిల్ 28న వంశిక మృతదేహం ఒట్టావా బీచ్ వద్ద లభించింది. వంశిక మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం వెల్లడించింది. పంజాబ్‌కు చెందిన వంశీక సైనీ డేరా బస్సీలో సీనియర్ సెకండరీ పూర్తి చేసింది. ఆ తర్వాత కెనడాలో రెండేళ్ల ఆరోగ్య విభాగంలో డిగ్రీ పట్టా పొందింది. ప్రస్తుతం కాల్ సెంటర్‌లో పని చేస్తోంది. అంతకుముందు ఒక ప్రైవేట్ క్లినిక్‌లో ఉద్యోగం చేసింది. అంతలో ఈ లోకాన్ని విడిచిపెట్టేసింది.
ALSO READ: దారుణం.. కన్నబిడ్డను దారుణంగా కొట్టిన కసాయి తల్లి
కొన్నాళ్లుగా కెనడాలో భారతీయ విద్యార్థుల మరణాలు పెరుగుతున్నాయి. ఇటీవల భారతీయ విద్యార్థిని హర్ సిమ్రత్ మృతి చెందాడు. గ్యాంగ్ వార్‌లో భాగంగా జరిగిన కాల్పుల్లో బస్టాప్‌లో ఉన్న సమయంలో బుల్లెట్ తగిలి అనూహ్యంగా చనిపోయాడు. కొన్నాళ్ల కిందట రాక్‌లాండ్ ఏరియాలో ఓ భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చెప్పాలంటే విద్య కోసం అక్కడికి వెళ్లిన భారతీయులు ఏదో రూపంలో మృత్యువాత పడుతున్నారు.