Student Committed Suicide: జగిత్యాల జిల్లాలోని జాబితాపూర్ గ్రామంలో.. ఓ హృదయవిదారక సంఘటన వెలుగుచూసింది. చదువు కోసం హైదరాబాదులో ఉంటున్న బీటెక్ విద్యార్థిని.. స్నేహితురాళ్లు అవమానానించారని ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే…
జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) ప్రాంతంలో .. ఓ ప్రైవేట్ వసతిగృహంలో ఉంటూ.. అక్కడి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది.
అయితే ఇటీవల నిత్య స్నేహితురాళ్లైన వైష్ణవి, సంజన చదువులో వెనకబడిపోయావు.. “నీకు ఇంజినీరింగ్ చదవడం అవసరమా? అంటూ మాటలతో తీవ్రంగా అవమానించినట్టు.. ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మాటల ప్రభావంతో తీవ్ర మనస్థాపానికి గురైన నిత్య, జూలై 2వ తేదీన స్వగ్రామానికి చేరిన వెంటనే.. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
వెంటనే చికిత్సకు తరలింపు
ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిత్య, జూలై 5వ తేదీన రాత్రి చికిత్స పొందుతూ మరణించింది. నిత్య మరణ వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
నిత్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై మాట్లాడుతూ .. మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణల ప్రకారం.. నిత్యను అవమానించిన స్నేహితురాళ్లు వైష్ణవి, సంజనలపై కేసు నమోదు చేశాం. వారి పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. విద్యార్థుల మానసిక ఒత్తిడి వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నాం అని తెలిపారు.
సామాజిక బాధ్యత అవసరం
ఈ సంఘటన విద్యార్థుల మానసిక స్థితిపై.. సమాజం ఎంతగా శ్రద్ధ వహించాలో మరోసారి గుర్తు చేస్తోంది. స్నేహితుల మాటలు, సహ విద్యార్థుల ప్రవర్తన ఒకరి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేయగలవో.. ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. కళాశాలలు, హాస్టల్స్, కుటుంబ సభ్యులు సమన్వయంతో విద్యార్థుల భావోద్వేగాలను గుర్తించి, వారికి ధైర్యం చెప్పాలి. మనసు నొప్పించే మాటలతో కాకుండా, ప్రోత్సహించే మాటలతో విద్యార్థులను ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది.
Also Read: యజమాని భార్య, కొడుకుని హత్య చేసిన ఉద్యోగి.. ఆ పని చేయమని అడిగినందుకే
నిత్య మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా.. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.