Hyderabad News: లక్ష రూపాయలు ఇస్తావా? ఖతం చేయమంటావా? అని బెదిరించటమే కాకుండా వ్యాపారిపై దాడి చేసిన గాయపరిచిన రౌడీ గ్యాంగులోని ఏడుగురిని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు కత్తులు, గొడ్డలి, వేటకొడవలితోపాటు మరో చిన్న కత్తి, ఆరు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాలాపత్తర్ వాస్తవ్యుడైన సయ్యద్ మొహియుద్దీన్ ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ సెకండ్ సేల్ వ్యాపారి. సుల్తాన్ పూర్ నివాసి కరీం అతని స్నేహితుడు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా మొహియుద్దీన్ తరచూ కరీం నడుపుతున్న గోడౌన్ వద్దకు వెళ్లేవాడు. ఇలాగే ఈనెల 10న రాత్రి 7గంటల సమయంలో తన వద్ద పని చేస్తున్న ముస్తఫాతో కలిసి గోడౌన్ వద్దకు వెళ్లాడు.
Also Read: Supreme Court: గీతం యూనివర్సిటీకి బిగ్ షాక్.. విద్యుత్ బకాయిలపై సుప్రీం కోర్టు కీలక అదేశం
అక్కడ కరీంను కలిసి మాట్లాడాడు. రాత్రి 8గంటలకు పని ముగించుకుని ముస్తఫాతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు ఆలీషాన్ హోటల్ వద్దకు రాగానే కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన అసద్, జహంగీర్ లు మరో ముగ్గురితో కలిసి వీరిని అడ్డుకున్నారు. మొహియుద్దీన్, ముస్తఫాలను దౌర్జన్యంగా సగ్గాఫ్ కాలనీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అసద్ గ్యాంగులోని కుర్దూస్, ఇక్భాల్ లు జత కలిశారు. ఆ తరువాత అసద్ లక్ష రూపాయలు ఇవ్వాలని మొహియుద్దీన్ ను డిమాండ్ చేశాడు. కత్తి చూపించి బెదిరిస్తూ డబ్బు ఇవ్వకపోతే ఇక్కడే నిన్ను ఖతం చేస్తా అని బెదిరించాడు. ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని మొహియుద్దీన్ చెప్పటంతో కత్తితో ముఖం, తల వెనక భాగంలో దాడి చేశాడు. మిగితా వాళ్లు చేతులు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.
ఆ తరువాత మొహియుద్దీన్ పర్సులో ఉన్న నగదును దోచుకున్నారు. కాగా, దెబ్బల బాధ భరించలేక మొహియుద్దీన్ పెద్దగా కేకలు పెట్టటం విన్న స్థానికులు దగ్గరకు వస్తుండటం చూసి నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. మల్లాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మొహియుద్దీన్ ఆ తరువాత బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు గ్యాంగులోని మహ్మద్ అసద్, మహ్మద్ జహంగీర్, ఫర్హాన్ నవాజ్, మహ్మద్ సయీద్, మహ్మద్ అల్తాఫ్, మహ్మద్ ఇక్భాల్ మొహియుద్దీన్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కుద్దూస్ బస్రావీ, సైఫ్ ఎలియాస్ ఫైజల్, మహ్మద్ ఇమ్రాన్ ఎలియాస్ ఇమ్మూల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.