ప్రతాప్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కీలక నేత లాల్ బహదూర్ యాదవ్ ఒక ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం బాబుగంజ్ బజార్ ప్రాంతంలో కదులుతున్న కారుపై భారీ విద్యుత్ స్తంభం పడటమే ఈ మరణానికి కారణమని పోలీసులు ధృవీకరించారు.
లిక్కర్ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన 47 ఏళ్ల లాల్ బహదూర్ యాదవ్ వ్యక్తిగత పనిపై తన కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో ఒక పెట్రోల్ పంప్ సమీపంలో సుమారు 400 కిలోల బరువున్న 30 అడుగుల ఎత్తైన హైమాస్ట్ లైట్ పోల్‌ను అధికారులు అమర్చుతున్నారు. దురదృష్టవశాత్తు ఆ భారీ స్తంభం అదుపుతప్పి నేరుగా యాదవ్ ప్రయాణిస్తున్న కారుపై కుప్పకూలింది. ఈ హఠాత్పరిణామంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
స్తంభం పడిన శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యాదవ్‌ను బయటకు తీశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆ స్తంభం పడిన వేగానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని ముమ్మాటికీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంగానే వారు పరిగణిస్తున్నారు. మృతుడి బాబాయి శంకర్ లాల్ యాదవ్ మాట్లాడుతూ.. హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేసే సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు. భారీ యంత్రాలతో పని చేసేటప్పుడు వాహనాల రాకపోకలను ఎందుకు నిలిపివేయలేదని ఆయన ప్రశ్నించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అజాగ్రత్తగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు అలాగే సంబంధిత సిబ్బందిపై విచారణ జరుపుతామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం లాల్ బహదూర్ యాదవ్ మరణంతో జిల్లా ఎస్పీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ALSO READ: Prathyusha Case: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు రేపే.. న్యాయం జరుగుతుందా?