Gachibowli Benz Car Accident: హైదరాబాద్ ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో శనివారం ఉదయం చోటుచేసుకున్న బెంజ్ కారు బీభత్సం ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహ ప్రదర్శించిన ధైర్యసాహసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మద్యం మత్తులో ఉన్న నిందితుడు గుర్రంపాటి తరుణ్ (24) నార్సింగి నుండి అతివేగంగా కారును నడుపుతూ ఒక వాహనాన్ని ఢీకొట్టి పారిపోతున్నట్లు కంట్రోల్ రూమ్ నుండి పోలీసులకు అలర్ట్ అందింది. ఈ క్రమంలో గచ్చిబౌలి త్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నరసింహ.. నిందితుడిని ఎలాగైనా అడ్డుకోవాలన్న పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు.
కిలోమీటరు దూరం బోనెట్‌పైనే..
కంట్రోల్ రూమ్ సమాచారం ప్రకారం నిందితుడు గచ్చిబౌలి వైపు వస్తున్నాడని తెలుసుకున్న నరసింహ.. వెంటనే సిగ్నల్ వద్ద రెడ్ లైట్ వేసి ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అయితే నిందితుడు ఫ్రీ లెఫ్ట్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. నరసింహ ఒక బైక్‌ను అడ్డంగా ఉంచి కారును ఆపబోయారు. కారును ఆపుతున్నట్లే నటించిన నిందితుడు.. ఒక్కసారిగా వేగం పెంచి కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లాడు. ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం నరసింహ కారు బోనెట్‌పైకి దూకి దానిని గట్టిగా పట్టుకున్నారు. నిందితుడు కారును ఆపకుండా సుమారు ఒక కిలోమీటరు దూరం జిగ్-జాగ్ రీతిలో నడుపుతూ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లాడు. ముందున్న యూటర్న్ వద్ద నరసింహ అరుపులు విన్న ఇతర వాహనదారులు కారుకు అడ్డంగా రావడంతో నిందితుడు వాహనాన్ని నిలిపివేశాడు.
మద్యం మత్తులో విద్యార్థి..
కానిస్టేబుల్ నరసింహ వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడికి డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్ష నిర్వహించగా రక్తంలో ఆల్కహాల్ శాతం 160 mg/100 ml గా నమోదైంది. ఇది అనుమతించిన పరిమితి కంటే చాలా ఎక్కువ. నిందితుడు తరుణ్‌పై హత్యాయత్నం సహా మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో అతడిని సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుకు తరలించారు.
ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే తన ప్రాణాలకు ముప్పు ఉన్నా వెనకాడకుండా నిందితుడిని పట్టుకున్నానని కానిస్టేబుల్ నరసింహ పేర్కొన్నారు. విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ధైర్యసాహసాలు ప్రదర్శించిన నరసింహను ఉన్నతాధికారులు.. నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Yadadri Murder: యాదాద్రి జిల్లాలో ఘోరం.. నిద్రిస్తున్న భర్తను సుత్తితో కొట్టి చంపిన భార్య!