Yadadri Murder: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్తను భార్య సుత్తితో కొట్టి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుండాల మండల కేంద్రానికి చెందిన భిక్షం, అతని భార్య ఉపేంద్ర. ఆదివారం ఉదయం భిక్షం గాఢ నిద్రలో ఉండగా.. ఉపేంద్ర సుత్తితో అతని తలపై బలంగా బాదింది. తీవ్ర రక్తస్రావం కావడంతో భిక్షం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య చేసిన అనంతరం నిందితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిలబడింది.
ఆ సమయంలో పెట్రోలింగ్ ముగించుకుని వస్తున్న పోలీసులు, స్టేషన్ ముందు నిలబడిన ఆమెను చూసి అనుమానంతో విచారించారు. విచారణలో తన భర్త భిక్షంను తానే హత్య చేసినట్లు ఉపేంద్ర ఒప్పుకోవడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితురాలు ఉపేంద్ర గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతోందని గ్రామస్తులు వెల్లడించారు. ఈ కారణం చేతనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. స్పాట్లోనే ముగ్గురు