Hyd News : అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత అధికారులు యువకుడి కుటుంబానికి తెలిపారు. ఖైరతాబాద్ ఎం.ఎస్ మక్తాకు చెందిన మహమ్మద్ వాజిద్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు.. చదువులతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవాడు. అలాంటి వాడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో హైదరాబాద్ లోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగులు చేసుకుంటూ విద్యాభ్యాసం చేస్తున్న వాజిద్.. నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇండియాలు ఉన్నప్పుడు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వాజిద్.. గతంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డివిజన్ యువజన నాయకుడిగా పని చేశాడు. ప్రస్తుతం సైతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న వాజిద్.. ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ మైనారిటీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఓ వైపు చదువులు, మరోవైపు కుటుంబం కోసం కష్టపడుతున్న ఈ యువకుడు.. రాజకీయాల ద్వారా సమాజానికి ఉపయోగపడాలనే కోరికతో ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఇన్నాళ్లు తమకు అన్ని విధాలుగా అండదండగా ఉన్న వ్యక్తి దూరమయ్యే వరకు తీవ్రంగా దుఃఖిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం చికాగోలో ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
యువకుడి మృతి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అనిల్ కుమార్ సహా ఇతర నాయకులు యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అతని కుటుంబానికి తోడుగా ఉంటామని, క్రీయాశీల యువ నాయకుడు ఇలాంటి ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విచారకరం అంటున్నారు.