KPHB Women Suicide: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో.. దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వర్క్ ఫ్రమ్ హోం అంటూ టెలిగ్రామ్ ద్వారా వచ్చిన ఆఫర్‌ను నమ్మిన ఆమె.. చివరికి మోసానికి గురై తన జీవితాన్ని కోల్పోయింది.
మొదట చిన్న మొత్తంలో లాభం
మహిళకు టెలిగ్రామ్‌లో వర్క్ ఫ్రమ్ హోం – ఈజీ ఎర్నింగ్స్ అనే పేరుతో.. మెసేజ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. మొదటగా నమ్మకంగా అనిపించిన ఆ ఆఫర్‌లో ఆమె ఫస్ట్ రూ.1000 పెట్టుబడి పెట్టింది. దానికి రూ.7000 లాభం వచ్చినట్లు చూపించారు. కానీ ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే ప్రయత్నంలో సమస్యలు ఎదురయ్యాయి. మీ లిమిట్ పెంచాలంటే ఇంకొంచెం డిపాజిట్ చేయాలి అని మరో మెసేజ్ వచ్చింది.
పెరిగిన నమ్మకం, పెరిగిన నష్టాలు
లాభం వస్తుందన్న ఆశతో ఆమె వెంటనే మరో నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1,00,000 తెచ్చి టెలిగ్రామ్ లింక్‌లో ఇచ్చిన ఖాతాకు పంపించింది. కానీ ఆ డబ్బు పోయింది. ఖాతా నిలిపివేయబడిందని చూపించింది. అప్పటికే ఆమెకి మోసపోయానన్న నిజం అర్ధమైంది. అదే సమయంలో కుటుంబ సభ్యులతో కూడా వాగ్వాదాలు జరిగినట్లు తెలుస్తోంది.
నాలాగా ఎవరూ మోసపోకండి- సూసైడ్ నోట్
నాలాగా ఎవరూ మోసపోకండి.. నేను తప్పు చేశాను అంటూ సూసైడ్ నోట్ రాసి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బెట్టింగ్ అలవాటు కూడా కారణమేనా?
పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా.. బెట్టింగ్ యాప్‌ల లింకులు, చాటింగ్ హిస్టరీ కూడా గుర్తించారు. గతంలోనూ పలు బెట్టింగ్ యాప్‌లకు ఆమె అడిక్ట్ అయినట్లు భావిస్తున్నారు. టెలిగ్రామ్ మోసాలు, బెట్టింగ్ అలవాట్లు ఇవన్ని కలిసి ఆమెను మానసికంగా వేధించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న సైబర్ మోసాలు
ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోం స్కాములు ఇటీవల టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగం లేని యువతను టార్గెట్ చేస్తున్నారు. ప్రథమంగా చిన్న లాభాలు చూపించి, ఆ తరువాత పెద్ద మొత్తాలను వసూలు చేసి మోసం చేస్తున్నారు.
Also Read: బ్లౌజులో చెయ్యిపెట్టి.. మలేషియన్ మోడల్‌కు చేదు అనుభవం.. పూజారిపై ఆరోపణలు
మున్ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ ఘటన అన్ని వర్గాల వారికి గమనిక. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఎలాంటి ఆఫర్‌లు, లింకులు, నమ్మశక్యంగా ఉన్నా కూడా ముందుగా.. తెలియని వ్యక్తులకు లావాదేవీలు చేయకూడదు. డబ్బు పెట్టే ముందు అందరిని అడిగి సమాచారం తీసుకోవాలి. వారిచేతిలో మోసపోయే ప్రమాదం ఉంది. ఈ విషాదకర ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్టు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.