Malaysia model assault: మలేషియాలో ఓ ప్రముఖ మోడల్‌కి దేవాలయంలోనే చోటుచేసుకున్న దారుణం ఇప్పుడు అందరి మనసులను కలచివేస్తోంది. ఆయన ఒక పూజారి.. కానీ తన వృత్తి ధర్మాన్ని మరిచి ప్రవర్తించాడని తెలుపుతూ.. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్. మలేషియాలోని సెపాంగ్ పట్టణంలోని శ్రీ మరియమ్మన్ ఆలయంలో ఇటీవల ఆమెకు ఎదురైన ఘోర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..?
తాను ఆలయానికి ఇటీవలే వెళ్లడం ప్రారంభించానని, అక్కడ పూజల గురించి తెలుపుతూ.. ఒక పూజారి నిత్యం గైడ్ చేస్తూ ఉండేవాడని లిషాలినీ చెప్పింది. తనకు ఆలయ పూజా విధివిధానాలు ఆయనే కాస్త అర్థం చేసుకునేలా బోధించేవాడని కూడా ఆమె తెలిపింది. ఒకరోజు దేవాలయంలో పూజలు జరిగే సమయంలో ఆమెతో ఆ పూజారి ప్రత్యేకంగా మాట్లాడాడట. పవిత్ర జలంతో నీకు ఆశీర్వాదం ఇస్తా, ఎటువంటి చెడు జరగకుండా దారం కూడా కడతా అని చెప్పాడని లిషాలినీ తెలిపారు.
అయితే ఆ తర్వాత జరిగిన ఘటనే ఆమె జీవితానికే మచ్చలా మిగిలిపోయింది. పూజారి తన కార్యాలయంలోకి రావాలని చెప్పడంతో, మొదట ఆమె కొద్దిగా అనుమానంతో ఉన్నప్పటికీ అతని మాటలు నమ్మి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక కూర్చోమని చెప్పి, తన దగ్గర ఉన్న గులాబీ పూలు కలిపిన నీటిలో వాసన వచ్చే ద్రవాన్ని కలిపాడని, అది ఇండియా నుంచి తెచ్చిన ప్రత్యేకమైన పవిత్ర జలం అని చెప్పాడని ఆమె తెలిపింది.
అతను ఆ నీటిని ముఖానిపై చల్లుతుండడంతో కళ్లు తెరువలేకపోయానని, అలాగే ఆ నీటి వాసనతో తలనొప్పిగా మారిందని తెలిపింది. అంతలోనే తన దుస్తులు పైకి లేపమని చెప్పాడని, తాను నిరాకరించగానే.. ఇలా బిగుతుగా ఉన్న బట్టలతో ఆలయంలోకి రావడం తప్పు అంటూ కోపంగా నీటిని చల్లాడని ఆమె ఆరోపించింది. ఆ వెంటనే తన వెనుక నిలబడి బ్లౌజులో చెయ్యి పెట్టి అసభ్యంగా తాకాడని, బ్రాలోకి కూడా చేతులు పెట్టాడని ఆమె వాపోయింది.
ఈ ఘటనపై ఆమె ఇంకా వివరిస్తూ.. ఆ క్షణంలో నాకు ఇది తప్పు అనిపించింది. కానీ నేను కదలలేకపోయాను.. మాట్లాడలేకపోయాను.. నేను భయపడిపోయాను అంటూ తను ఎదుర్కొన్న ఘటన గురించి వివరించింది. ఇప్పటికీ ఎందుకు ఆ సమయంలో స్పందించలేకపోయానో తనకు అర్థం కావట్లేదు అంటూ ఆమె కన్నీటి మాటల్లో వివరించింది.
Also Read: Train viral meme: రైల్వే ట్రాక్ పై ధర్నా.. అదే రూట్లో రైలు.. వీడియో చూస్తే నవ్వులే!
అనంతరం ఆ ఘోరమైన అనుభవం ఆమెను పూర్తిగా కుంగదీసిందని, 2 రోజుల పాటు షాక్ లోకి వెళ్లిపోయానని చెప్పింది. ‘ఇది ఒక పూజారి చేసిన పని. దేవుడి మందిరంలో.. నేను పూజ చేస్తున్న సమయంలో.. ఇది నా మీద అత్యంత ఘోరమైన మోసం. నన్ను ఆత్మవంచనకు గురిచేసింది అంటూ తన బాధను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇక పోలీసుల వ్యవహారంపై మాట్లాడుతూ, కేసును దర్యాప్తు చేస్తున్న అధికారే తనను బెదిరించాడని, ‘ఇది బయట పెట్టావంటే నిన్నే నిందిస్తారు అంటూ హెచ్చరించాడని లిషాలినీ ఆరోపించింది. దీంతో విసిగిపోయిన ఆమె, అసలు విషయం ప్రజల ముందుంచేందుకు నిర్ణయించుకుంది.
ఈ ఘటనపై స్పందించిన సెపాంగ్ జిల్లా పోలీసు అధికారి నొర్హిజామ్ బహామన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రధాన నిందితుడు ఆలయంలో తాత్కాలికంగా పూజారిగా ఉన్నాడని, ఆ పూజారి ఇండియా వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. ‘ఈ సంఘటనలో నిందితుడు మొదట పవిత్ర జలాన్ని మొహానికి, శరీరానికి చల్లుతూ ఆపై లైంగిక వేధింపులకు పాల్పడటం జరిగిందని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చేపట్టినట్లు, త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సంఘటన దేవస్థానాల ప్రతిష్టను మాత్రమే కాదు, మానవ సంబంధాల పట్ల నమ్మకాన్ని కూడా తుంచేసేలా ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఒకరు భక్తిగా వచ్చిన చోట, అన్యాయం జరిగిందంటే.. అది సమాజానికి అపశకునమే. లిషాలినీ ధైర్యంగా ముందుకు వచ్చి సత్యాన్ని బయట పెట్టినందుకు మద్దతు ఇవ్వాలంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.