అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే క్రమంలో.. తమ పౌరులనే కాకుండా.. యావత్తు ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేశాడు. అది కాదన్నట్లు.. వివిధ దేశాల యుద్దాల్లో వేలు పెడుతూ.. తనను తాను శాంతి కపోతంగా ప్రకటించుకుంటున్నాడు. ఇరాన్ – ఇజ్రాయెల్ గిల్లికజ్జాల్లో సైతం దూరి.. పెద్దరికాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు.
అందుకే ఇరాన్ ఇప్పుడు ఆయనపై పీకల్లోతు కోపంతో ఊగిపోతుంది. ఏదో ఒక రోజు నువ్వు దొరక్కపోతావా.. మేం లేపేయకపోతామా అన్నట్లుగా.. ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. నువ్వు సన్ బాత్ చేస్తుంటే.. మా క్షిపణి వచ్చి నీ మీద పడుతుందని ప్రకటించింది. అయితే, ట్రాంప్ దాన్ని కూడా వాడేసుకుంటున్నాడు. నన్ను ఇరాన్ లేపేస్తుందట.. అంటూ సింపథీ కార్డు బయటకు తీశాడు. అదంతా పక్కన పెడితే.. ఇరాన్ నిజంగానే ట్రంప్‌ను అంతం చెయ్యగలదా? అతడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అది సాధ్యం కాకపోవచ్చు. కానీ, అధ్యక్ష పదవి పోయిన తర్వాత? అప్పుడు ఆయనకు ఎలాంటి భద్రత ఉంటుంది? ఇప్పుడు ఆయనకు ఎలాంటి సెక్యూరిటీ అందిస్తున్నారు?
అమెరికా అధ్యక్షుడికి ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ ఇదే
ఇరాన్(Iran)కు ట్రంప్‌పై ఉన్న పగ ఇప్పటిది కాదు. 2020 సంవత్సరంలో ఇరాన్ ముఖ్యనాయకుడు కాసిమ్ సోలైమానీపై డ్రోన్‌తో దాడి చేసింది చంపేసింది. అప్పటి నుంచి ఇరాన్.. అమెరికా అత్యున్నత నాయకులను టార్గెట్ చేసుకుంది. ఆ జాబితాలో ట్రంప్ కూడా ఉన్నాడు. ఈ విషయం తెలిసి కూడా ట్రంప్.. మరోసారి ఇరాన్‌ను కెలికాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిపై ఉన్న ట్రంప్ మీద ఈగ వాలడం కూడా కష్టమే. ఎందుకంటే.. ఆయన చుట్టూ కొన్ని అంచెల సెక్యూరిటీ ఉంటుంది. ట్రంప్ వద్ద సూపర్ హీరోల్లాంటి బాడీ గార్డులు ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో వీళ్లు ట్రంప్ కార్యాలయం, నివాసం.. తదితర ప్రాంతాల్లో పాగా కాస్తుంటారు. అంతకాదు.. అత్యాధునిక కెమేరాలు, కంప్యూటర్లు సైతం పరిసరాలపై కన్నేసి ఉంచుతాయి. చీమ చిటుక్కుమన్న చెవులు చిల్లుపడే సైరన్లు సెక్యూరిటిని అప్రమత్తం చేస్తాయి. అయితే, ఇదంతా పైకి కనిపించే వ్యవస్థ. సెక్యూరిటీతోపాటు.. జనాల్లో కొంతమంది గూడచారులు కూడా ఉంటారు. వారు కేవలం అమెరికాలోనే కాదు.. వివిధ దేశాల్లో యాక్టీవ్‌గా ఉంటారు. అమెరికా, ఆ దేశ అధ్యక్షుడిపై కుట్రలను తెలుసుకుని వాటిని ముందుగానే అడ్డుకుంటారు.
బాహుబలి లాంటి బాడీ గార్డ్స్..
ట్రంప్ వద్దు సీక్రెట్ సర్వీస్ అనే సెక్యూరిటీ టీమ్ ఉంటుంది. వారంతా ట్రంప్‌కు నీడలా ఉంటారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం ఆయనతోనే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. వారు వెంట ఉండాల్సిందే. ట్రంప్ బయటకు అడుగుపెడుతున్నాడని తెలియగానే ఆ టీమ్ ముందు ఆయా పరిసరాల్లో తనిఖీలు చేస్తుంది. అంతా సురక్షితం అని తెలిసిన తర్వాతే ట్రంప్‌ను బయటకు తీసుకెళ్తుంది. ఏ మాత్రం సందేహం వచ్చినా.. పరిసరాల్లో సైన్యాన్ని మోహరించి మరీ.. జల్లెడ పడతారు. వీరి వద్ద నిత్యం అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. అవి ప్రపంచంలోనే అత్యంత బెస్ట్. టార్గెట్ ఎంత దూరంలో ఉన్నా గురిపెట్టి లేపేసే చురకత్తుల్లాంటి స్నైపర్స్ ఉంటారు.
బుల్లెట్ ప్రూఫ్‌కు వంద రెట్ల సెక్యూరిటీ ఇచ్చే కారు.. విమానం అధ్యక్షుడి సొంతం
ట్రంప్ వద్ద ది బీస్ట్ (The Beast) అనే సూపర్ కార్ ఉంది. చెప్పాలంటే అది ఒక ట్యాంకర్ లాంటింది. బయటకు మాత్రం చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. కానీ క్షిపణి దాడిని సైతం తట్టుకోగలిగే అంత బలమైనది. ఆ కారుకు మందపాటి రక్షణ కవచం ఉంటుంది. కిటికీలన్నీ బుల్లెట్ ప్రూఫ్. దెబ్బతిన్నా సరే నడిచే అత్యాధునిక టైర్లు ఈ కారుకు ఉంటాయి. ఇక గగనతలంలో ప్రయాణించేప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ (Air force One) అనే ప్రత్యేక విమానంలో ఆయన రక్షణ లభిస్తుంది. ఇది చాలా సురక్షితమైన విమానం. దాన్ని కూల్చడం అంత సాధ్యం కాదు. ర్యాడర్లకు కూడా చిక్కకుండా నడిచే టెక్నాలజీ ఈ విమానంలో ఉంటుంది. అంతేకాదు.. శత్రువులను గందరగోళానికి గురిచేసేందుకు.. ఎయిర్ ఫోర్స్ వన్‌ను పోలిన విమానాలను ఉపయోగిస్తారు. ఈ విమానానికి వైమానిక దళం భద్రత కల్పిస్తుంది. శత్రువులు డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తే మధ్యలోనే నిర్విర్యం చేస్తాయి. ఇటీవల ఈ భద్రతను మరింత పెంచారు FBI, CIA వంటి ఏజెన్సీలతో కలిసి డ్రోన్లు, అత్యాధునిక కంప్యూటర్లు, కెమేరాలతో శత్రువుల జాడను ముందుగానే తెలుసుకుని అప్రమత్తం అవుతున్నారు. ఇందుకు అమెరికా ప్రభుత్వం కొన్ని మిలియన్ డాలర్లను ఖర్చు పెడుతోంది.
పదవి విమరణ తర్వాత ఎలాంటి రక్షణ ఉంటుంది?
అంతా బాగానే ఉంది. మరి ఏదో ఒక రోజు ట్రంప్ ఆ పదవిని వీడాల్సిందే. దాని తర్వాత జనాల్లో కలవాల్సిందే. మరి ఇదే సెక్యూరిటీ అప్పుడు ఉంటుందా? అనే ప్రశ్నకు ఉండదనే చెప్పాలి. అయితే, మాజీ అధ్యక్షుడికి ఉండాల్సిన మోస్తారు సెక్యూరిటీని ట్రంప్‌కు కల్పిస్తారు. ప్రస్తుతం ఇరాన్ మోస్ట్ వాటెండ్ లిస్టులో ట్రంప్ ఉన్నాడు కాబట్టి.. కాస్త ఎక్కువ భద్రత కల్పించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ట్రంప్‌ను లేపేస్తాం.. మర్డర్ స్కెచ్‌కు 100 మిలియన్ డాలర్ల సేకరణ
మాజీ అధ్యక్షుడికి లభించే సెక్యూరిటీ ఇదే:
అమెరికా మాజీ అధ్యక్షుడికి ప్రభుత్వం జీవితాంతం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కల్పించిన సీక్రెట్ సర్వీస్ గార్డులు నిత్యం అధ్యక్షుడి వెంట ఉంటారు. అయితే, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారో అంతమంది ఉండరు. ప్రెసిడెంట్ భాగస్వామి, పిల్లలకు కూడ రక్షణ ఉంటుంది. ఇరాన్ లేదా ఏదైనా శత్రుదేశం హిట్ లిస్టులో ఉండే అధ్యక్షులకు అదనపు భద్రత కల్పించేందుకు కూడా అమెరికా వెనకాడదు. కాబట్టి ట్రంప్‌కు భారీ సెక్యూరిటీ లభించే అవకాశం ఉంది. అంతేగాక సొంతగార్డులను నియమించుకొనేందుకు కూడా అనుమతి ఉంటుంది. వీరు సీక్రెట్ సర్వీస్ సిబ్బందితో కోర్టినేట్ కావాలి.
అయితే, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చే ‘ది బీస్ట్’ కారు, ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉండవు. సీక్రెట్ సర్వీస్ కేవలం మాజీ అధ్యక్షుడికి రక్షణ మాత్రమే కల్పిస్తుంది. ఈవెంట్లకు వెళ్లేప్పుడు ఆయా స్థలాలకు ముందుగా వెళ్లి భద్రత తనిఖీలు చెయ్యడం వీలు కాదు. అందుకే.. ప్రైవేట్ సెక్యూరిటీకి అనుమతి ఇస్తారు. మాజీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం కోసం అమెరికాకు ఏటా రూ.900 కోట్లకు పైగా ఖర్చవుతుందట. అయితే, అమెరికా అధ్యక్షుడికి కల్పించే భద్రతకు అయ్యే ఖర్చు కంటే ఇది తక్కువే. ఎందుకంటే.. అమెరికా అధ్యక్షుడి కోసం ప్రభుత్వం ఏటా రూ.11,690 కోట్లు వెచ్చిస్తున్నారు.