Dehradun Boy Murder | ఓ 11 ఏళ్ల బాలుడు గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లాడిని వెతికేందుకు బాలుడి తండ్రి, అతని స్నేహితులు సమీపంలోని అన్ని ప్రాంతాలు గాలించారు. కానీ ఎక్కడా అతని జాడ లభించలేదు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయం తెలిసింది. పిల్లాడి కోసం వెతుకుతున్న అతని తండ్రి స్నేహితులలో ఒకడే ఆ బాలుడిని హత్య చేశాడని తేలింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజనోర్ కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక చిన్న కుటీర పరిశ్రమ నడుపుతున్నాడు. అతను ఇంట్లోనే చిప్స్, కుర్ కురే లాంటివి తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఇర్ఫాన్ భార్య, 11 ఏళ్ల కొడుకు అర్మాన్ ఉత్తర్ ప్రదేశ్ నుంచి డెహ్రాడూన్ పర్యటనకు వచ్చారు. అలా వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇర్ఫాన్ కొడుకు అర్మాన్ తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన ఇర్ఫాన్ అతను నివసిస్తున్న సెలకుయి ప్రాంతంలో తన కొడుకు అర్మాన్ కోసం గాలించడం మొదలుపెట్టాడు.
ఇర్ఫాన్ తన కొడుకు కనిపించడం లేదని బాధపడుతుండగా అతని స్నేహితులు కూడా అతనికి సాయం చేయడానికి రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు అర్మాన్ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో అంతా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒక మిస్సింగ్ కంప్లెయింట్ నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు. ముందుగా ఇర్ఫాన్ నివసిస్తున్న ప్రదేశమంతా గాలించి.. అక్కడ చుట్టుపక్కల ఉన్న సిసిటీవి కెమెరాలను గుర్తించారు. వాటిలో రికార్డ్ అయిన వీడియోలను పరిశీలించగా.. షాకింగ్ విషయం తెలిసింది.
Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్
ఒక సిసిటీవి వీడియోలో అర్మాన్ ఒక వ్యక్తి బైక్ వెనుక కూర్చొని వెళుతున్నట్లు కనిపించింది. కానీ ఆ వ్యక్తి ముఖం కనిపించలేదు. దీంతో పోలీసులు ఇర్ఫాన్ ని పిలిచి ఆ వ్యక్తిని గుర్తపట్టమని అడిగారు. ఇర్ఫాన్ అది చూసి నిర్షాంతపోయాడు. ఆ వ్యక్తి తనతోనే ఉన్నాడని.. అతను మరెవరో కాదు తన స్నేహితుడు అర్బాజ్ ఖాన్ అని చెప్పాడు. గత రెండు రోజులుగా అర్బాజ్ తనతోనే పిల్లాడి కోసం వెతుకుతున్నట్లు తెలిపాడు.
ఇదంతా విని పోలీసులు ముందుగా అర్బాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అర్బాజ్ ని పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. అప్పుడు అతను భయంకర నిజం చెప్పాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్బాజ్ ఖాన్, ఇర్ఫాన్ ఇద్దరూ ఉత్తర్ ప్రదేశ్ లోని బిజనోర్ కు చెందిన వారే. ఇద్దరు పక్క పక్క గ్రామాల్లో నివసించేవారు. కొన్నేళ్ల క్రితం బిజనోర్ లో ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. అర్బాజ్ కథనం ప్రకారం.. ఇర్ఫాన్ అతని వద్ద నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు. కానీ తరువాత దాన్ని తిరిగి ఇవ్వలేదు. ఆ డబ్బుతోనే డెహ్రాడూన్ లో వ్యాపారం పెట్టుకొని బాగా సంపాదించాడు. మరోవైపు అర్బాజ్ డెహ్రాడూన్ లోనే ఒక లేబర్ గా పనిచేస్తున్నాడు. స్నేహితుడు తన డబ్బులు తీసుకొని వాటిని తిరిగి ఇవ్వకుండా బాగా సంపాదించుకోవడం చూసి.. అర్బాజ్ అసూయ పడ్డాడు. అందుకే ఒక ప్లాన్ వేశాడు.
అర్బాజ్ ఖాన్ కు మరో స్నేహితుడు అయిన సోహెల్ తో కలిసి ఇర్ఫాన్ కొడుకు అర్మాన్ ని మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ పిల్లాడిని కట్టి పడేశారు. ఆ తరువాత ఇద్దరూ మద్యం సేవిస్తూ.. అర్మాన్ కిడ్నాప్ చేసి ఇర్ఫాన్ నుంచి డబ్బులు వసూలు చేద్దామని ప్లాన్ వేశారు. కానీ అర్మాన్ వారి చెర నుంచి అడవిలో తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గట్టిగా కేకలు వేశాడు. దీంతో భయపడిపోయిన అర్బాజ్, సోహెల్.. పిల్లాడిని హత్య చేసి అడవిలోనే పూడ్చి పెట్టేశారు. పోలీసులు అడవిలో నుంచి అర్మాన్ శవాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు.
అయితే హత్య కేసులో అర్బాజ్ కు సాయం చేసిన సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.