– నాలుగు దశాబ్దాల తర్వాత దళితులకు న్యాయం..
– 24మందిని దారుణంగా హత్య చేసిన కేసులో తుది తీర్పు
– ఐదుగురికి మరణ శిక్ష విధించిన మెయిన్ పురి కోర్టు
స్వతంత్ర భారత దేశ చరిత్రలో కొన్ని మారణ హోమాలు ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతుంటాయి. అలాంటి ఓ దారుణ ఘటనలో తాజాగా కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించడం సంచలనంగా మారింది. 44 ఏళ్ల తర్వాత బాధితులకు న్యాయం జరిగిందని దళిత సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే న్యాయం జీవితకాలం ఆలస్యమైందని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో సత్వర న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది..?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మెయిన్ పురి జిల్లాలో దిహులి గ్రామం అది. 1981 నవంబర్ 18న ఆ గ్రామంలో దారుణ మారణ హోమం జరిగింది. సరిగ్గా అర్థరాత్రి ఓ దోపిడీ దొంగల ముఠా ఆ గ్రామంపై విరుచుకుపడింది. చేతిలో మారణాయుధాలతో వారు రెచ్చిపోయారు. నిద్రలోనే ఆ గ్రామస్తులను దారుణంగా హత్య చేశారు. కనపడిన వారిని కనపడినట్టు కాల్చిపడేశారు. ఆ మారణహోమంలో 24మంది అక్కడికక్కడే చనిపోయారు. అయితే వారంతా దళితులు కావడం గమనార్హం. దీంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది.
అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో స్వయానా అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ.. బాధిత కుటుంబాలను కలిసేందుకు దిహులి గ్రామానికి వచ్చారు. వారికి సత్వర న్యాయం చేస్తామని మాటిచ్చారు. అయితే ఆమె మాటిచ్చినా కూడా 44 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు రావడం విశేషం. అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పేయి కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. దిహులి బాధితులకు సంఘీభావంగా ఆయన ఫిరోజాబాద్ లోని సదుపూర్ వరకు పాద యాత్ర చేపట్టారు. రాజకీయంగా కూడా అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది.
44 ఏళ్ల తర్వాత న్యాయం..
ఈ కేసు 44 ఏళ్లుగా న్యాయస్థానంలో తీర్పుకోసం వేచి చూసింది. చివరకు న్యాయస్థానం ఇటీవల ముగ్గురు వ్యక్తులను దోషులుగా నిర్థారించింది. వారికి ఈరోజు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 44 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడినా దోషుల్లో ఒకరు పరారీలో ఉండటం గమనార్హం.
దిహులి గ్రామంలో మారణ హోమం జరిగిన తర్వాత కేసు పెట్టేందుకు కూడా చాలామంది భయపడ్డారు. అందరూ దళితులు, నిరు పేదలు కావడంతో న్యాయపోరాటానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు స్థానికుడైన లైక్ సింగ్ ముందుకొచ్చాడు. ఈ ఘటనపై ఆయన కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు మొత్తం 17మంది బందిపోట్లపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ముఠా నాయకులు సంతోష్, రాధేని ప్రధాన కారకులుగా గుర్తించారు.
రాధే, సంతోష్ సహా మొత్తం 17మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వివరాలు సేకరించారు. అయితే ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరగడం విశేషం. 44 ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ జరిగే సమయంలో 17మంది నిందితుల్లో 13మంది మరణించారు. మిగతా నలుగురిలో ఒకరు పరారీలో ఉన్నారు. దీంతో మిగిలిన ముగ్గురికి కోర్టు మరణ శిక్ష విధించింది. కాప్తాన్ సింగ్, రామ్ సేవక్, రామ్ పాల్ కు కోర్టు మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.