Prakash Raj – Rana: ప్రస్తుతం యూత్ చాలావరకు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. కష్టపడకుండా రూపాయి పెట్టుబడి పెడితే అది పది రూపాయిలుగా మారుతుంది అంటే దానికోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. అలా ఈజీ మనీ సంపాదించడానికి చాలామంది ఎంచుకుంటున్న మార్గమే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టడం కోసం అప్పులు చేయడం, తర్వాత అందులో ఓడిపోయి అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం.. ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయి. అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే విషయంలో స్టార్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ప్రకాశ్ రాజ్, రానా కూడా ఇందులో భాగమే అన్న విషయం బయటపడింది.
కలిసి ప్రమోషన్స్
బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాదు ఆన్‌లైన్ రమ్మీ కూడా యూత్‌కు అడిక్షన్‌లాగా మారిపోయింది. డబ్బులు పెట్టుబడి పెట్టీ రమ్మీ ఆడి గెలిస్తే ఈజీ మనీ అనే అపోహలో చాలామంది ఉండడంతో వాటికి కూడా బాగా అలవాటు పడి అందులో డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఒకప్పుడు ఈ రమ్మీ యాప్స్‌ను కూడా ఇప్పటి బెట్టింగ్ యాప్స్‌లాగానే ప్రమోట్ చేసేవారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్‌పై, దానిని ప్రమోట్ చేస్తున్నవారిపై కేసులు నమోదు చేసినట్టు, అప్పట్లో రమ్మీ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం మంచిదని చాలామంది నెటిజన్లు ఫీలవుతున్నారు. అయితే అలా ప్రమోట్ చేసిన వారిలో ముందుగా ప్రకాశ్ రాజ్, రానా పేర్లే బయటపడ్డాయి.
అదీ తప్పే
టాలీవుడ్ యంగ్ హీరో రానా కేవలం హీరోగానే కాకుండా మరెన్నో రంగాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో తను పలు బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ కూడా చేస్తుంటాడు. అలా తను యాక్టివ్‌గా యాడ్స్ చేస్తున్న సమయంలో ఒక రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేశాడు. ఆ యాడ్‌లో రానా (Rana)తో పాటు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కూడా ఉన్నారు. అలా ఈ ఇద్దరూ కలిసి అప్పట్లోనే ఆన్‌లైన్ రమ్మీని ప్రమోట్ చేశారు. దీంతో వీళ్లిద్దరూ చేసింది కూడా తప్పే అని, వీరిపై కూడా కేసు నమోదు చేయాల్సిందే అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రమ్మీ కూడా బెట్టింగ్ యాప్‌లాగా ఈజీ మనీ కోసం చేసేదే అని, దానికి దీనికి తేడా లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మేము బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదు.. సుప్రిత కేసుపై స్పందించిన సురేఖ వాణి
కేసు నమోదు
ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు చాలామంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. ముందుగా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవు అనే విషయం బయటపడిన వెంటనే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. ఈ కేసు తమ వరకు రాకుండా ముందు జాగ్రత్తగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసి తప్పు చేశామని తప్పు ఒప్పుకున్నారు. కానీ భవిష్యత్తులో కూడా ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేసే ధైర్యం ఎవరూ చేయకూడదనే ఉద్దేశ్యంతో పలువురిపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.