Tuni Case Update: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్యపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల నారాయణరావు మృతి చెందాడని ఫ్యామిలీ సభ్యుల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చారు తుని పోలీసులు. నిందితుడు నారాయణరావుని పోలీసుస్టేషన్ నుంచి చనిపోయే వరకు జరిగిన విషయాలను వెల్లడించారు.
అత్యాచార నిందితుడు ఆత్మహత్య వెనుక
తునిలో అత్యాచార నిందితుడు నారాయణరావు మృతిపై క్లారిటీ ఇచ్చారు పోలీసులు. నిందితుడ్ని స్టేషన్ నుంచి ఎస్కార్ట్‌తో జీపులో తీసుకెళ్లామని తెలిపారు. పోలీసు వాహనంలో నిందితుడితోపాటు ఎస్సై, పోలీసులు ఉన్నారని తెలిపారు తుని సీఐ. గురువారం ఉదయం మీడియా ముందుకొచ్చిన పోలీసులు, కుటుంబసభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
బుధవారం రాత్రి భారీ వర్షం పడిందని, ఆ తర్వాత నిందితుడ్ని తీసుకుని వాహనంలో బయలు దేరినట్టు వెల్లడించారు. మార్గమధ్యంలో బహిర్భూమికి వెళ్తానని నిందితుడు చెప్పడంతో వాహనం ఆపారని అన్నారు. సమీపంలోనే చెరువు ఉందన్నారు. నిందితుడు వయస్సు ఎక్కువగా ఉండడంతో బేడీలు వేయడం సరికాదని వేయలేదన్నారు. ఆ సమయంలో ఆయన చెరువులోకి దూకినట్టు చెప్పారు.
స్టేషన్ నుంచి చెరువు వరకు
ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని వివరించారు. స్కూల్ నుంచి బాలికను ఎలా పంపించారనే దానిపై క్లారిటీ ఇచ్చారు. మా తాత వచ్చాడని, తనను పంపించాలని ప్రిన్సిపల్‌కు బాలిక లేఖ రాసిందన్నారు. నారాయణరావుని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రశ్నించారని గుర్తు చేశారు. బాలిక ఇచ్చిన లేఖ మీద ఆయన సంతకం తీసుకుని పంపినట్టు తెలిపారు.
ఘటన సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడని తెలియజేశారు. ఆ వ్యక్తి మంచి ఉద్దేశంతో తీసిన వీడియో స్థానిక టీచర్‌కి ఇచ్చాడని అన్నారు. టీచర్.. ఆ ఊరు పెద్దలకు ఇచ్చారని అక్కడి నుంచి విచ్చలవిడిగా ట్రోల్ చేశారని అన్నారు. బాలిక వీడియో చూసిన పేరెంట్స్ కన్నీరు మున్నీరు అయ్యారని అన్నారు. తమను రోడ్డు మీదకు ఈడ్చారని, ఎలా బతకాలని బాధిత బాలిక తల్లిదండ్రులు అడిగారని అన్నారు.
ALSO READ: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య
మైనర్ బాలిక వీడియో పదే పదే చూపిస్తున్నారని బాధిత తల్లి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. దీనిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. బాధితురాలిని మీడియాలో చూపించడం, ట్రోల్ చేయడం ముమ్మాటికీ తప్పుగా వర్ణించారు. ఓ పార్టీకి చెందిన గ్రూపు, ఇండివిడ్యువల్‌గా ఎక్కువగా ట్రోల్ చేశారని అన్నారు.
దయచేసి ఈ విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని, గ్రూపులు, పార్టీల విషయాన్ని పక్కన పెట్టాలన్నారు పోలీసులు. బాధితులను బాధితుల మాదిరిగా చూడాలన్నారు. ఎవరైతే బాధిత బాలిక వీడియో ట్రోల్ చేశారో వారందర్నీ అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కాస్త కొత్త మలుపు తిరిగింది. రేపటి రోజున ఈ కేసులో ఎంతమంది అరెస్టు అవుతారో చూడాలి.