Digital Arrest Scam: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీటిల్లో డిజిటల్ అరెస్టు ఒకటి. పోలీసులు, ఇతర అధికారులు చేసినట్లు వీడియో కాల్స్ చేసి డిజిటల్ అరెస్టు పేరిట బెదిరించి కోట్లు కాజేస్తున్నారు. బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ సుమారు రూ. 32 కోట్ల విలువైన డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో చిక్కుకుంది. సైబర్ మోసగాళ్లు డీహెచ్ఎస్ సిబ్బంది, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులుగా నమ్మించి బాధితురాలిని నెల రోజుల డిజిటల్ అరెస్టు చేశారు.
చివరికి తాను మోసపోయానని తెలుసుకుని నవంబర్ 14న బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 15, 2024న బాధితురాలికి డీహెచ్ఎల్ చేస్తున్నట్లు ఓ వ్యక్తి కాల్ చేశాడు. ముంబైలోని అంధేరిలో ఆమె పేరు మీద బుక్ చేసిన ఓ ప్యాకేజీలో నాలుగు పాస్‌పోర్ట్‌లు, మూడు క్రెడిట్ కార్డులు, నిషేధిత డ్రగ్స్ ఉన్నాయని సైబర్ కేటుగాడు నమ్మించాడు. అయితే తాను ముంబై వెళ్లలేదని చెప్పడంతో.. మీ వివరాలను దుర్వినియోగం చేశారని ఈ కేసును సైబర్ క్రైమ్ కేసుగా మారుస్తున్నామని చెప్పుకొచ్చాడు.
ఆమె షాక్ లో ఉందని గమనించిన నిందితులు.. కాల్ ను సీబీఐ అధికారులకు బదిలీ చేస్తున్నామని నమ్మించారు. ఆమెను వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని, అరెస్టు చేస్తామని బెదిరించారు. స్థానిక పోలీసులను ఫిర్యాదు చేయవద్దని, కొందరు వ్యక్తులు ఆమె ఇంటిపై నిఘా పెట్టారని భయపెట్టారు. కుటుంబ సభ్యుల భద్రతకు భయపడి ఆమె డిజిటల్ అరెస్టుకు ఒప్పుకుంది. మోసగాళ్లు ఆమెతో రెండు స్కైప్ ఐడిలను ఇన్‌స్టాల్ చేయించారు. దీంతో ఓ వ్యక్తి ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు నమ్మించి హౌస్ అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత సీబీఐ అధికారిగా చెప్పుకున్న మరో వ్యక్తి కాల్ లోకి వచ్చాడు. ఆమెను అరెస్టు చేస్తామని బెదిరించాడు.
కాల్ చేసిన వాళ్లకు తన ఫోన్ యాక్టివిటీ, లొకేషన్ తెలియడంతో తాను ఇంకా భయపడ్డానని మహిళ పోలీసులకు తెలిపింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ద్వారా తన పేరిట ఆస్తుల వివరాలను సమర్పించాలని స్కామర్లు నమ్మించారు. స్కామర్లు సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుంచి నకిలీ లేఖలను కూడా పంపించారని బాధితురాలు తెలిపింది.
సెప్టెంబర్ 24, అక్టోబర్ 22, 2024 మధ్య బాధితురాలు తన బ్యాంకు ఖాతా వివరాలను స్కామర్లకు అందజేసింది. ఆ తర్వాత మోసగాళ్లు ఆమె ఆస్తులలో 90 శాతం క్లియరెన్స్ కోసం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అదనంగా రూ. 2 కోట్లు పూచీకత్తుగా డిపాజిట్ చేయాలన్నారు. డిసెంబర్ 1, 2024న ఆమెకు నకిలీ క్లియరెన్స్ లెటర్ పంపారు. మానసిక ఒత్తిడితో సుమారు నెల రోజుల పాటు ఆమె ఆసుపత్రి పాలైంది. 2025 ప్రారంభం వరకు స్కామర్లు ఆమెను డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. డిపాజిట్ చేసిన మొత్తాలను ఫిబ్రవరి నాటికి తిరిగి ఇస్తామని చెప్పారు. అయితే మార్చి 26, 2025 నుంచి స్కామర్ల నుంచి కమ్యూనికేషన్లు బంద్ అయ్యాయి. స్కామర్ల బారిన పడి బాధిత మహిళ రూ. 31.83 కోట్ల విలువైన 187 లావాదేవీలు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Satish Kumar Murder Case: సతీష్ కుమార్ హత్యపై డొంక కదిలింది.. గుట్టు అంతా ఫోన్ కాల్స్‌లో