Fake Baba: కష్టపడడం ఇష్టం లేక కొందరు వ్యక్తులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. దానివల్ల సొసైటీలో గౌరవమే కాదు.. డబ్బు కూడా సులువుగా వస్తుందని భావిస్తున్నారు. ప్రజల పిచ్చిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. అదేంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. అదేనండి బాబా అవతారం. ఇంటికి నరఘోర ఎక్కువగా ఉందని మహిళా లెక్చరర్ నుంచి 20 లక్షలు కొల్లగొట్టాడు ఆ ఫేక్ బాబా.
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేవో తెలియదు. కానీ ఇదంతా ఒకప్పటి సామెత. కలియుగంలో మాత్రం మంత్రగాళ్లకు కాసులు బాగానే రాలుతున్నాయి. ఫేక్ బాబాలు నమ్మి చదువుకున్నవారు సైతం వారి ఉచ్చులో పడిపోతున్నారు. కష్టపడిన సొమ్మంతా పొగొట్టుకున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆ తరహా బాబాలు రెచ్చిపోతున్నారు.
లెక్చరర్‌ని ముంచేసిన ఫేక్ బాబా
హైదరాబాద్ సిటీలో ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటికి నరఘోష ఉందని, అది పోగొట్టుతానంటూ ఓ ఫేక్ బాబా ఓ అధ్యాపకురాలిని మోసం చేశాడు. ఏకంగా రూ. 20 లక్షలకు టోపీ పెట్టాడు. కాచిగూడ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది? లోతుల్లోకి వెళ్దాం.
ఏం జరిగింది?
పోలీసులు చెప్పిన వివరాల మేరకు కాచిగూడకు చెందిన ఓ మహిళ దిల్‌సుఖ్‌నగర్‌లో జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తోంది. కొద్దిరోజుల కిందట లెక్చరర్ భర్త చనిపోయాడు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆమె చదువుకోవడంతో లెక్చరర్ అవతారం ఎత్తారు. తన పరిస్థితి గురించి తరుచూ ప్రిన్సిపల్‌తో చెప్పుకుని బాధపడేది.
ALSO READ: బాలికపై అత్యాచారం కేసులో స్పోర్ట్స్ టీచర్ అరెస్ట్
నరఘోష పేరుతో టోకరా
ఆమె సమస్యలను విన్న ఆయన, ఉచితంగా ఓ సలహా ఇచ్చేశాడు. ఆయన చెప్పినట్లే ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ శివ స్వామిని ఆశ్రయించింది. లెక్చరర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న స్వామి, ఓ రోజు ఆమె ఇంటికి వచ్చాడు. ఇంటికి ఊహించని విధంగా నరఘోర తగిలిందని, దాని కారణంగా భర్త చనిపోయాడని కొత్త అనుమానాలు క్రియేట్ చేశాడు.
నిజమేనని నమ్మేసింది ఆమె. పూజలు చేయకుంటే ఈ సమస్యలు మరింత రెట్టింపు అవుతాయని చెప్పాడు. ఆయా విషయాలను చెప్పి ఆమెలో భయాన్ని పెంచాడు. తొలుత పూజల పేరుతో రూ. 1.70 లక్షలు వసూలు చేశాడు. తర్వాత ఆలయంలో పూజల కోసం 20 తులాల ఆభరణాలు ఆమె నుంచి తీసుకున్నాడు.
పూజలు చేస్తున్న క్రమంలో ఆలయ అర్చకుడు చనిపోయాడంటూ భయపెట్టాడు. చివరకు కాచిగూడలోని ఆమె ఇంటి పత్రాలను కాజేశాడు. ఈ విషయం లెక్చరర్ కూతురుకి తెలిసింది. చివరకు తల్లిని ఆ స్వామి వద్దకు తీసుకెళ్లి గొడవ పెట్టుకోవడంతో ఇంటి పత్రాలు ఇచ్చేశాడు.
ఆమె నుంచి తీసుకున్న డబ్బు, 20 తులాల బంగారం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్బీనగర్ పోలీసులు ఫేక్ బాబాపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. ఇది బయటకు వచ్చిన కేసు మాత్రమే. ఇలాంటి నగరం, శివారు ప్రాంతాల్లో చాలానే జరుగుతున్నాయి. బయటకు చెబితే పరువు పోతుందని భావించి చాలామంది సైలెంట్ అయిపోతున్నారు.