తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో గురువారం అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచ్చి నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ బస్సు ఎదురుగా వస్తున్న రెండు కార్లను అత్యంత వేగంతో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు, కార్లు రెండూ అధిక వేగంతో ఉండటంతో కార్లు నుజ్జునుజ్జయ్యాయి. బస్సు టైరు పేలిన శబ్దం తమకు వినిపించిందని స్థానికులు తెలిపారు. కార్లలో ప్రయాణిస్తున్న వారు లోపలే ఇరుక్కుపోవడంతో మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించారు. ఈ ఘోర ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ALSO READ: Aravalli Mining: మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరావళి మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం..