Yadadri Crime: యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదమైన ఘటన చోటుచేసుకుంది. తన మాట వినకుండా ప్రేమించిన వాడితో వెళ్తుందన్న కోపంతో, కూతురికి ఏదో ‘దోషం’ ఉందని నమ్మిన ఓ తండ్రి ఆమెకు నాటు మందు ఇప్పించాడు. చివరకు ఆ మందు వికటించడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
భువనగిరి పట్టణం రాంనగర్‌కు చెందిన పల్లాల సిరి, గత కొంతకాలంగా తన పాఠశాల నాటి మిత్రుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. అయినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోకుండా సదరు యువకుడితో కలిసి రెండుసార్లు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు ఆమెను వెతికి తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఎన్నిసార్లు చెప్పినా సిరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో.. ఆమె తండ్రి శ్రీనివాస్ అది ఏదో ‘దోషం’ లేదా ‘మానసిక సమస్య’ అని భావించారు. ఆమెను దారికి తెచ్చేందుకు ఆధునిక వైద్యం కంటే నాటు వైద్యమే మేలని నమ్మి కొంతమంది నాటు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఇచ్చిన చెట్ల మందును సిరికి తాగించారు. అయితే.. ఆ మందు ఆమె శరీరానికి పడకపోవడంతో సిరి తీవ్ర అస్వస్థతకు గురైంది.
పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సిరి మృతి చెందింది. ప్రేమించిన యువకుడితో వెళ్తుందనే ఆవేదనతో తండ్రి చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకు తెచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మూఢనమ్మకాలు లేదా నాటు వైద్యం వల్ల ఇలా జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:ఆగి ఉన్న లారీని ఢీకొన్న స్కూటీ.. బీటెక్ విద్యార్థిని మృతి