Kadapa News: వేసవికాలంలో ఎంజాయ్ చేయాలని ఉవ్విల్లూరుతారు చిన్నారులు. ఆ సరదాయే ఆ ఐదుగురు బాలురుల ప్రాణం తీసింది. చివరకు ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఆ ఐదుగురు. ఈ విషాద ఘటన కడప జిల్లాలో మల్లెపల్లె గ్రామంలో వెలుగుచూసింది. పిల్లలను ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె గ్రామ చెరువులో ఘోరం జరిగింది. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఐదుగురు బాలురులు ఈత కోసం గ్రామంలోని చెరువుకి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఈతకు వెళ్లినవారు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టారు.
చివరకు చెరువు గట్టుపై దుస్తులు, చెప్పులు ఉండటంతో వారంతా గల్లంతు అయ్యారని భావించారు. ఈ గండం నుంచి తమ పిల్లలను రక్షించాలని దేవుళ్లకు మొక్కుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఈ ఊరులోని గజ ఈతగాళ్లు చెరువులోకి దిగి గాలింపు చేపట్టారు.
రాత్రి పదిన్నర గంటల సమయంలో వారి మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీశారు. దీంతో అక్కడ విషాదం నెలకొంది. మృతి చెందినవారిలో వేసవి సెలవుల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఆ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు.
ALSO READ: లారీ-బొలెరో ఢీ.. స్పాట్ లో ఐదుగురు కూలీలు మృతి
కడప జిల్లా బ్రహ్మగారి మఠం మల్లేపల్లె గ్రామానికి చెందిన గంగాధర్-రమశ్రీ దంపతుల కొడుకు 12 ఏళ్ల దీక్షిత్. నంద్యాల జిల్లా పెద్దబోధనంకు చెందిన సుబ్బయ్య-భవాని దంపతుల 15 ఏళ్ల చరణ్,11 ఏళ్ల పార్దు ఉన్నారు. జమ్మలమడుగు మండలం ఉప్పలపాడుకు చెందిన రామకృష్ణయ్య-సావిత్రి దంపతుల కుమారుడు 12 ఏళ్ల హర్షవర్ధన్, కాశినాయన మండలానికి చెందిన నారాయణ కొడుకు 10 ఏళ్ల తరుణ్ యాదవ్ ఉన్నారు.
ఈత కోసం చెరువు వద్దకు ఏడుగురు వెళ్లారు. అందులో చిన్న వయసు కలిగిన బాలుడు ఏడుస్తుండడంతో మరొక బాలుడు బాబుని తీసుకుని వెనుతిరిగారు. ఈ ఘటనలో వారిద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కడప జిల్లాలో చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లి గడిచి ఐదేళ్లలో 359 మంది మృత్యువాత పడ్డారు. చిన్నారుల పాలిట ఆ చెరువులు, బావులు యమపాశాలుగా మారాయి.