జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని ఒక ప్రముఖ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్నాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోపల ఉన్న కార్మికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో అందరూ బయటకు పరుగులు తీశారు. చూస్తుండగానే అగ్నికీలలు ఫ్యాక్టరీ అంతటా విస్తరించాయి.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న నల్లటి పొగ ఆకాశాన్ని కమ్ముకుంది. పరిసర ప్రాంతాల్లో గాలి కలుషితమై స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం మేరకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని యంత్రాలు అలాగే ముడి సరుకులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దీనివల్ల భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఫ్యాక్టరీలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా..? లేదా….? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నష్ట పరిహారం ఎంత అనేది అంచనా వేస్తున్నారు.
ALSO READ: Chinmayi: నీ తండ్రి నిన్ను రే*ప్ చేసింటాడు.. దిమ్మతిరిగేలా చిన్మయి సమాధానం!