Hyderabad Case: ఇదిగో చూడండి.. ఓ చిన్న కిరాణా దుకాణం. బయట నుంచి చూస్తే కూరగాయలతో, రోజువారీ వస్తువులతో కస్టమర్ల రద్దీ. డబ్బులు వర్షం కురుస్తోంది.. కానీ ఆ డబ్బుల వర్షం వెనుక ఎవ్వరూ ఊహించని మత్తు వ్యాపారం ఉంది. చాక్లెట్ తియ్యగా ఉంటుంది కానీ.. ఇందులో మాత్రం ఉన్న తియ్యదనం యువత భవిష్యత్తుని కాల్చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతికి చేరేలా తయారు చేసిన ఈ మత్తు, చివరకు పోలీసుల దృష్టికి వెళ్లింది. చివరికి అందరి నోట్లోకి వెళ్లిన అసలు మత్తు వెలుగులోకి వచ్చింది.
నందిగామ మండలంలో గంజా కలకలం రేగింది. షాద్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న ఓ కిరాణా దుకాణంలో గంజా చాక్లెట్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. శనివారం జరిగిన ఈ దాడిలో అధికారులు మొత్తం 2 కిలోల గంజాను, 9 కిలోల గంజా చాక్లెట్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.3.5 లక్షలుగా ఉన్నట్టు అంచనా. ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానికంగా చర్చనీయాంశమైంది.
అరెస్టైన వ్యక్తిని పింటూ సింగ్‌గా గుర్తించారు. ఇతడు బీహార్‌కు చెందినవాడని, గత కొన్ని రోజులుగా నందిగామ వద్ద పాత జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గంజా విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గంజా చాక్లెట్ రూపంలో అమ్మకాలు జరుగుతున్నాయన్న విషయం బయట పడటంతో, మత్తు పదార్థాల వ్యాపారం కొత్త రూపాలు తీసుకుంటోందన్న ఆందోళన మొదలైంది.
Also Read: Vizag Metro Project: విశాఖ మెట్రోపై లేటెస్ట్ అప్ డేట్.. ఎన్ని ఫ్లై ఓవర్లు వస్తున్నాయంటే?
పెద్దవాళ్లు, పిల్లలు తేడా లేకుండా అందరూ తినే చాక్లెట్ రూపంలో గంజా కలపడం, దాన్ని కిరాణా షాపుల దగ్గరే అమ్మడం వల్ల యువత ప్రమాదకర మార్గాల్లోకి వెళ్లే అవకాశముందని పోలీసుల అభిప్రాయం. ఇది ఎంతమంది చేతుల్లోకి వెళ్ళిందో తెలియక స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఇప్పటి వరకు నేరుగా గంజా విక్రయం జరిగితే, ఇప్పుడు చాక్లెట్ రూపంలో పంపిణీ అవుతుండటమే కాకుండా, పిల్లలు కూడా దీన్ని తినే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ NDPS చట్టం కింద కేసు నమోదు చేసింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులకు సమాచారం అందించిన వ్యక్తికి గుర్తింపును గోప్యంగా ఉంచారు. ఇకపై ఈ తరహా అక్రమ వ్యాపారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, చాక్లెట్ వంటి ఉత్పత్తులపై తల్లిదండ్రులు, పాఠశాలలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చిన్నారుల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే, ఇటువంటి మత్తు పదార్థాలపై నిఘా పెంచడం తప్పనిసరని పోలీసులు తెలిపారు.