భారతీయ రైల్వేలో అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైలుగా అందుబాటులోకి వచ్చిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు దేశ వ్యాప్తంగా భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే రైళ్లు అన్నీ 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా వందేభారత్ రైళ్లకు కోచ్ లను పెంచుతున్నారు. రీసెంట్ గా వైజాగ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు కోచ్ ల సంఖ్య పెంచగా, తాజాగా బెంగళూరు వందేభారత్ కోచ్ ల సంఖ్య పెంచాని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. డిమాండ్ కు అనుగుణంగా కాచిగూడ – యశ్వంత్ పూర్ – కాచిగూడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు అదనపు కోచ్ లను యాడ్ చేయాలని నిర్ణయించింది.
వందేభారత్ కోచ్ ల సంఖ్య రెట్టింపు
ప్రస్తుతం కాచిగూడ- యశ్వంత్ పూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు 8 కోచ్ లతో నడుస్తుంది. ఈ రైలు 530 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో నడుస్తోంది. జూలై 10 నుంచి ఈ రైలు కోచ్ లు రెట్టింపు కానున్నాయి. అంటే 8 నుంచి 16 కోచ్ లకు పెరగనున్నాయి. ప్రయాణీకుల సామర్ధ్యం 1,128 మందికి పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ఈ రైలులో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్, ఏడు చైర్ కార్లు ఉండేవి. ప్రారంభం నాటి నుంచి ఈ రైలు క్రమం తప్పకుండా 100% ఆక్యుపెన్సీతో నడుస్తోంది. చాలా మంది ఈ రైలు సేవలను ఉపయోగిస్తున్నందున, భారతీయ రైల్వే ఈ రైలుకు మరో ఎనిమిది కోచ్‌లను జోడించాలని నిర్ణయించింది. ఈ కొత్త రైలులో 1,024 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కూడిన 14 చైర్ కార్లు, 104 మంది ప్రయాణికులకు సామర్థ్యం కలిగిన రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. మొత్తంగా ఒకేసారి 1,128 మంది ప్రయాణీకులు జర్నీ చేసే అవకాశం ఉంటుంది.
Read Also: అరుణాచలం టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC అదిరిపోయే ప్యాకేజీ మీ కోసమే!
ఐటీ నగరాల మధ్య జర్నీ చేసే వారికి మరింత ఉపయోగం
వందేభారత్ రైలుకు అదనపు కోచ్ లను పెంచడం వల్ల ఐటీ నగరాలు అయిన హైదరాబాద్- బెంగళూరు మధ్య కనెక్టివిటీ మరింత పెరగనుంది. రెండు నగరాల మధ్య ఎక్కువ మంది రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ తెలిపారు. ఈ వందేభారత్ కోచ్ లు ఇప్పుడు రెట్టింపు కాబోతున్నాయి. 7 చైర్ కార్లు 14 కానుండగా, 1 ఎగ్జిక్యుటివ్ కోచ్ కాస్త రెండు కోచ్ లుగా మారనున్నాయి. ఎక్కువ మంది ప్రయాణీకులకు సేవలు అందించనున్నాయి.
Read Also: ఈ వైరల్ ఫొటోలో ఉన్న పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చూస్తే షాకవుతారు!