Vizag Metro Project: విశాఖపట్నం నగరం ఇప్పుడు నిజంగా మలుపు తిరుగుతోంది. సాధారణంగా బీచ్‌లతో, టూరిజంతో పేరు తెచ్చుకున్న ఈ నగరం.. ఇప్పుడు మోడరన్ ట్రాన్స్‌పోర్ట్ మోడళ్ల వైపు పరుగులు పెడుతోంది. తాజా సమాచారం ప్రకారం, విశాఖపట్నం–భోగాపురం మార్గంలో, నేషనల్ హైవే 16పై మొత్తం 3 ఎలివేటెడ్ ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. ఒక్కటే కాదు, మొత్తం 12 జంక్షన్లు ముట్టడించేలా ఈ ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
మొదటి దశలో, 1వ జంక్షన్ నుంచి 8వ జంక్షన్ వరకూ సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఒక దీర్ఘ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఇది నగరంలోని అత్యంత ట్రాఫిక్ భారంతో కూడిన మార్గం. తరువాతి దశలో, 9వ నుంచి 11వ జంక్షన్ వరకు మరో 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఇక చివరగా, 12వ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఒక విడిపోయిన ఫ్లై ఓవర్ ఏర్పాటవుతోంది.
ఈ మొత్తం ప్రాజెక్టు లోతుగా చూస్తే, ఇది కేవలం వాహనాల సౌలభ్యం కోసం మాత్రమే కాదు. దీని వెనక మరో పెద్ద ఆలోచన ఉంది. మెట్రో రైలు వ్యవస్థను ఈ ఫ్లై ఓవర్లపైకి తీసుకురావడం.. అంటే, ట్రాఫిక్ కోసం కింద ఫ్లై ఓవర్, పట్టణ రవాణాకు పైన మెట్రో. ఒక్కసారి చూసిన వారికి ఈ డ్రాఫ్ట్ ఖచ్చితంగా నాగ్‌పూర్ స్టైల్‌ను గుర్తుచేస్తుంది. అవునే.. నాగ్‌పూర్ మోడల్ ఆధారంగా ఈ మెట్రో ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నారు.
ఇందుకు కావలసిన సమన్వయం కోసం మూడు కీలక సంస్థలు రంగంలోకి దిగాయి. ఏపీ ప్రభుత్వం, NHAI (National Highways Authority of India), APMRCL (Andhra Pradesh Metro Rail Corporation Limited) కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లు ఒకే లైన్‌లో పనిచేయడమే ఈ ప్లాన్ స్పీడ్‌కు అసలు కారణం.
ఇక ఫలితాల పైన వస్తే, ఈ మెగా ప్లాన్ పూర్తయితే, వైజాగ్ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రధాన జంక్షన్లలో రోజూ వచ్చే ట్రాఫిక్ జామ్, సిగ్నల్‌ల గందరగోళం తగ్గుతుంది. మెట్రో రైలు వచ్చేస్తే, ప్రజలు తమ స్వంత వాహనాలను వదిలేసి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎంచుకునే అవకాశం పెరుగుతుంది. దాంతో నగరపు కాలుష్యం కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
ఇక భవిష్యత్తులో విశాఖపట్నం బహుశా బీచ్‌ల నగరం కంటే ఎలివేటెడ్ నగరం అనే పేరు సంపాదించుకుంటుందేమో! ఫ్లై ఓవర్ మీదుగా వెళ్తున్న ట్రాఫిక్, వాటి పైన దూసుకెళ్తున్న మెట్రో ట్రెయిన్.. ఈ దృశ్యం భవిష్యత్తులో చాలా సాధారణమైపోతుంది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నిత్యం ప్రయాణించే నగరవాసులకు ఇది ఒక బంపర్ గిఫ్ట్ అనే చెప్పాలి.