
Honor Killing : వేరే కులానికి చెందిన యువకుడు తమ కుమార్తెను ప్రేమించాడన్న కోపంతో.. బాలిక కుటుంబసభ్యులు ఆ యువకుడిని చంపేశారు. ఎన్నిసార్లు మందలించినా తీరు మార్చుకోలేదని.. అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో జరిగింది.
ఘట్‌కేసర్ అన్నోజిగూడకు చెందిన పద్దెనిమిదేళ్ల కరణ్‌నాయక్.. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి మరణించగా తల్లి యాదిబాయ్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే కరణ్‌కు.. అదే కాలనీలో ఉండే బాలిక మధ్య కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు. కుమార్తె విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కరణ్‌ను చాలాసార్లు మందలించారు. అయితే కరణ్.. బాలికను కలుస్తూనే ఉన్నాడు. చెప్తున్నా వినలేదన కోపంతో.. కరణ్‌పై కక్ష పెంచుకున్నారు.
రెండు రోజుల క్రితం.. బాలిక తల్లిదండ్రులు ఓ శుభకార్యానికి వెళ్లారు. అప్పుడు ఇంట్లో బాలిక ఒక్కర్తే ఉంది. ఇదే అదునుగా భావించిన కరణ్.. అర్థరాత్రి బాలిక ఇంటికెళ్లాడు. సమాచారం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు వెంటనే తిరిగివచ్చారు. కరణ్ తప్పించుకోకుండా ముందుగా బయట నుంచి గడియపెట్టారు. మరికొందరి సాయంతో యువకుడిని ఇష్టమొచ్చినట్లుగా చితకబాదేశారు. అతడి శరీరంపై బట్టలు తీసేసి కారం చల్లుతూ.. కర్రలతో కొడుతూ దాదాపు గంటపాటు చిత్రవధ చేశారు. దీంతో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. కాసేపటికే చనిపోయాడు. సమాచారం తెలిసి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాలిక తల్లిదండ్రులు సహా 9 మందిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.