Pileru Crime News: వివాహేతర సంబంధానికి అడ్డాస్తోందని కట్టుకున్న భార్యను కుటుంబ సభ్యులతో కలిసి కడతేర్చాడో భర్త. ఈ హత్యకు నిందితుడి అమ్మమ్మ, తల్లి, చెల్లెలు సహకరించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పీలేరు మండలం కాకులారంపల్లెలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మంగపల్లెకు చెందిన శంకర్ రెడ్డి కుమార్తె ఇందుజకు పీలేరు మండలం కాకులారంపల్లె పంచాయతీ బందార్లపల్లెకు చెందిన విజయ్ శేఖర్ రెడ్డితో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు రుషిత, చార్విక్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ శేఖర్ రెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్య ఇందుజ అడ్డు తొలగించుకుంటే తమ వివాహేతర సంబంధం కొనసాగించవచ్చని భావించిన విజయ్ శేఖర్ రెడ్డి ఆమె హత్యకు పథకం వేశారు.
శనివారం రాత్రి ఇందిరమ్మ కాలనీలో జరుగుతున్న గంగ జాతరకు గ్రామస్థులంతా వెళ్లారు. గ్రామంలో జన సంచారం లేకపోవడంతో విజయ్ శేఖర్ రెడ్డి, అతని అమ్మమ్మ అమ్మణ్ణమ్మ, తల్లి శాంతమ్మ, అక్క సునంధ, వివాహేత సంబంధం కొనసాగిస్తున్న మహిళ అందరూ కలిసి ఇందుజ గొంతు నులిమి చంపేశారు. అనంతరం సమీపంలోని వ్యవసాయ బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించారు.
Also Read: ఉలిక్కిపడ్డ అమెరికా హిందూలు.. ఇస్కాన్ టెంపుల్ పై కాల్పులు
అయితే శేఖర్ రెడ్డి తల్లి శాంతమ్మ సలహాతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి బెడ్ రూమ్‌లో పడుకోబెట్టారు. నిద్రలోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అల్లుడే తమ బిడ్డను చంపాడని ఇందుజ తల్లి జీవన జ్యోతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపారని డీఎస్పీ తెలిపారు.