Heavy Rains: దసరా ముసురు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. వాయుగుండం కారణంగా ఏపీలోని ఉత్తరాంధ్ర భారీగా డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో బీహార్ నుండి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికారణంగా రాబోయే మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసింది. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో వాతావరణం పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండురోజులు ఎండ కాస్తే.. మూడు రోజులు వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ సిటీలో ఆకాశం ముసిరేసింది. రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఉదయం డ్యూటీకి వెళ్లేవారు నరకయాతన పడ్డారు. వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది.
వర్షం కారణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా టీమ్స్ చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అయ్యింది. వారి వాహనాలపై డ్యూటీకి వెళ్లేవారు ఇబ్బందిపడ్డారు. చివరకు మెల్లగా ఆఫీసులకు చేరుకున్నారు. ఉదయం పడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులుపడ్డారు.
పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్
ఉపరితల ద్రోణి వల్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ-IMD తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని అనేక ప్రాంతాలకు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అయ్యింది.
కామారెడ్డి, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లోని సోమవారం ఉదయం పలు చోట్ల గంటపాటు వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత తగ్గు ముఖం పట్టనున్నాయి. జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. నారాయణఖేడ్‌లో మూడుగంటలుగా కుండపోత వర్షం కురిసింది.
ALSO READ: రాష్ట్రంలో కుండపోత వర్షాలు, ఆ జిల్లాలకు అలర్ట్
అత్తాపూర్‌లో అత్యధికంగా 50 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అమీర్ పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్-46, చిలకలగూడ- 42, శ్రీనగర్ కాలనీ-34, బేగంపేట్-31 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ పెరిగింది.
ఇటు ఏపీలోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ద్వారకకు తూర్పున 530 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య -వాయువ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన లోతైన అల్పపీడనం సోమవారం రాత్రికి ఒమన్ మీదుగా తీరాన్ని తాకే అవకాశం ఉంది.