ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇష్టపడే పండ్లలో ఆపిల్స్ ఒకటి. వీటి అమ్మకాలు కూడా అధికంగానే ఉంటాయి. ప్రతిరోజు ఒక యాపిల్ పండు తింటే చాలు. ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయని చెబుతారు. వైద్యుల వద్దకు వెళ్లే అవకాశాలను కూడా చాలా మేరకు ఆపిల్స్ తగ్గించేస్తాయని అంటారు. వసంత రుతువులో, వేసవిలో యాపిల్స్ ఎక్కువగా మార్కెట్లకు వస్తాయి. అలా వచ్చిన యాపిల్స్ శీతాకాలం వరకు నిల్వ చేస్తారు. అందుకే ఆపిల్ పండ్లు ఎప్పుడూ మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి. అయితే యాపిల్ పండును అధికంగా తినే వారికి ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
ఆపిల్ పండ్లు తింటే క్యాన్సర్ రాదు
ప్రతిరోజు ఒకటి లేదా రెండు ఆపిల్ పండ్లు తినేవారికి ఎంతో మేలు జరుగుతుందని కొత్త అధ్యయనంలో తేలింది. వాటిలో సహజ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎన్నో రకాల వ్యాధుల నుంచి బయట పడేస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని యాపిల్స్ తగ్గిస్తాయి. అందుకే ఆపిల్స్ అధికంగా తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
యాపిల్స్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ హృదయ సంబంధం వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే యాపిల్ తొక్కలలో ఆంథోసైనిన్లు ఉంటుంది. ఈ ఆంథోసైనిన్ల వల్ల యాపిల్ తొక్కలకు ఎర్రటి రంగు వస్తుంది. ఇది గుండె ఆరోగ్యం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక యాపిల్స్ లో ఉండే పీచు పదార్థం… శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడే మరొక పాలీఫెనాల్.. ఫ్లోరిడ్జిన్. ఈ సమ్మేళనాలన్నీ కూడా మన శరీరంలో ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
ఈ వ్యాధులు రావు
ఈ సమ్మేళనాలు టైపు 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి. 2017 అధ్యయనం ప్రకారం ఆపిల్స్ క్రమం తప్పకుండా తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఆపిల్ ఉత్పత్తులను అధికంగా తినేవారికి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
2020లో నిర్వహించిన ఒక చిన్న అధ్యయనం ప్రకారం రెండు యాపిల్స్ ప్రతిరోజు తింటే చాలు… వారి రక్తంలో హానికరమైన కొవ్వు స్థాయిలు చాలా వరకు తగ్గినట్టు గుర్తించారు. అయితే ఆపిల్ ఒక్కటే తింటే సరిపోదు. మిగతా ఆహారాలను కూడా తినాలి. మిగతా పండ్లు, కూరగాయలు కూడా మన శరీరానికి అత్యవసరం.
ఆపిల్స్ లో ప్రయోజనకరమైన పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కవచంలా మారుతాయి. యాపిల్స్ లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు ఎన్ని యాపిల్స్ అయినా ఆరోగ్యంగా తినవచ్చు.