Hyderabad Crime: కోట్లు సంపాదించి ఎగ్గొట్టడానికి చదువులు అవసరం లేదు. కేవలం నమ్మకం ఉంటే చాలని చూపించారు. పైన కనిపిస్తున్న పుల్లయ్య. ప్రజల వీక్ నెస్‌ని తన వ్యాపారంగా మలచుకున్నాడు కోట్లకు పడగలెత్తాడు. చివరకు 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్ సిటీ నుంచి పరారయ్యాడు. ఇంతకీ ఎక్కడ? ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
నమ్మకం.. ఆలోచన పెట్టుబడి
బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందినవాడు పుల్లయ్య. దాదాపు 18 ఏళ్ల కిందట ఫ్యామిలీతో హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. అయితే బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ ఉంటున్నాడు. చిన్నకాలనీలో నివాసం ఉంటున్నాడు. పల్లెటూరులో రూపాయి విలువ తెలుసుకున్నాడు. చదువు లేకపోవడంతో కూలీగా మారిపోయాడు. కొన్ని నెలలు ఆ పని చేశాడు. అయినా ఫలితం లేకపోయింది.
ఇరుగు పొరుగువారితో పరిచయాలు పెంచుకున్నాడు. దాన్ని వ్యాపారంగా మలచుకున్నాడు. కూలి పని నుంచి కొత్త అవతారం ఎత్తాడు పుల్లయ్య. 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారాన్ని నిర్వహిస్తూ వస్తున్నాడు. తొలుత తక్కువ డబ్బులతో మొదలుపెట్టాడు. దాన్ని అలా లక్షలకు మార్చాడు. పుల్లయ్య అంటే ఆ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. నమ్మకానికి మారు పేరుగా నిలిచాడు.
డబ్బు చూస్తే ఎంతటివారికైనా ఆశ పుడుతుంది. మారిపోతారు. అందుకు ఎగ్జాంఫుల్ పుల్లయ్య. అదే తొలుత రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలను వేసేవాడు. సుమారు రెండు వేల మంది చందాదారులు పుల్లయ్య వద్ద చిట్టీలు వేశారు. చిన్న గుడిసెలో ఉన్న పుల్లయ్య తక్కువ సమయంలో కోటీశ్వరుడి అవతారం ఎత్తాడు. ఈ సొమ్ముతో పెద్ద భవనాన్ని కట్టేశాడు.
ALSO READ: హైదరాబాద్‌లో మ్యాట్రిమోనీ స్కామ్
చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపేవాడు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నారని చాలామంది నమ్మారు. తన వద్ద చిట్టీలు కట్టించిన వారితో మళ్లీ చిట్టీలు వేయించేవాడు. ఈ క్రమంలో తెలిసిన వారి వద్ద నుంచి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. సీన్ కట్ చేస్తే.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచి అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితులకు ఎగ్గొట్టిన డబ్బుల విలువ అక్షరాలా రూ.100 కోట్ల పైమాటే. చిట్టీలు కట్టిన వారికి ఈనెల 23 నుంచి 26వ లోపు డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఈనెల 21న కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. ఆ తర్వాత సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. బుధవారం మధ్యాహ్నం దాదాపు 700 మందికి పైగా బాధితులు అతడి ఇంటికి చేరారు.
పుల్లయ్య కోసం వచ్చామని, డబ్బులు ఇస్తానని చెప్పాడని చెప్పడం మొదలుపెట్టారు. కొందరు మహిళలైతే కంటతడి పెట్టుకున్నారు. పుల్లయ్య బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పుల్లయ్య ఇంట్లో నగదు లెక్కపెట్టేందుకు ఐదు యంత్రాలు ఉన్నాయన్నది బాధితుల మాట. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేవలం నమ్మకం మీద ఇదంతా చేశాడు. ఇంతకీ పుల్లయ్య జాడ తెలియలేదు. మరి పుల్లయ్య వెళ్లిపోయాడా? లేక సిటీలో మరో ప్రాంతానికి మకాం మార్చేశాడా అనేది తెలియాల్సివుంది.