Hyderabad News: మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా వైద్యురాలితో పరిచయం చేసుకున్నాడు ఓ మోసగాడు. త్వరలో పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మించాడు. తమ బ్యాంక్ అకౌంట్స్ ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది అంటూ నమ్మించాడు. ఆ లేడీ డాక్టర్ నిజమేనని నమ్మింది. అడ్డంగా మోసగాడి చేతికి చిక్కింది. ఈ వ్యవహారం చివరకు పోలీసుల వరకు వెళ్లింది.
ఆన్‌లైన్ మోసాలు
ఆన్‌లైన్ మోసాలు ఎప్పుడు ఏ విధంగా జరుగుతాయో తెలీదు. ఈ విషయంలో యువతీ యువకులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిత్యం హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొందరు పెడచెవిన పెట్టిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా హైదరాబాద్ ఓ లేడీ డాక్టర్ ఆ తరహా ఉచ్చులో పడి మోసపోయింది. దాదాపు 11 లక్షలు పోగొట్టుకుంది. చివరకు తాను మోసపోయానని భావించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి లోతుగా వెళ్దాం.
మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా కుచ్చుటోపి
జూబ్లీహిల్స్‌లో ఉంటున్న 31 ఏళ్ల ఓ లేడీ డాక్టర్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఇటీవల పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చింది. అయితే నిర్వాహకులు ఓ వ్యక్తికి చెందిన వివరాలు అందజేశారు. యువతి నెంబర్‌ను ఆ వ్యక్తికి ఇచ్చారు. ఇంతవరకు సీన్ బాగానే జరిగింది. అసలు తతంగం ఇక్కడి నుంచే మొదలైంది. ఆ తర్వాత అంటే జనవరి 30న వారిద్దరూ వాట్సాప్ చాటింగ్ ద్వారా మాట్లాడుకుంటున్నారు.
వారిద్దరి మాటల్లో ఏం జరిగిందో తెలీదు. సీన్ కట్ చేస్తే.. కాబోయే పెళ్లికొడుకు అనే మోసగాడు కొత్త డ్రామా తెరలేపాడు. తన తల్లి చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తోందని నమ్మించాడు. తమకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని నమ్మబలికాడు. నిజమేనని నమ్మంది ఆ మహిళా డాక్టర్. త్వరలో మా మదర్ ఇండియాకు వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఫైనల్ చేసుకుందామని మాయమాటలు చెప్పాడు. ఆ మాటలు వెనుక అసలు నిజాన్ని గుర్తించలేకపోయింది లేడీ డాక్టర్.
ALSO READ: బస్సులో యువతిపై అత్యాచారం
సరికొత్త డ్రామా మొదలు
అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. తనకు చెందిన కొన్ని ఫోటోలు అతడికి పంపింది లేడీ డాక్టర్. ఇటీవల యువతికి ఫోన్ చేసిన ఆ వ్యక్తి తనకు అర్జెంట్‌గా కొంత డబ్బు కావాలని చెప్పాడు. ఐటీ శాఖ దాడులతో బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయని నమ్మబలికాడు. పాన్ కార్డు సహా ఐటీ అధికారులు తీసుకువెళ్లారని కొత్త డ్రామాను క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి సూచించిన పలు నెంబర్లకు విడత వారిగా దాదాపు రూ.10.94 లక్షలు పంపించింది. త్వరలో డబ్బులు పంపిస్తానని నమ్మించాడు.
ఆ తర్వాత ఫిబ్రవరి 21న తల్లి అమెరికా నుంచి వచ్చాక ఎంగేజ్‌మెంట్ చేసుకుందమని లేడీ డాక్టర్‌కి చెప్పాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశాడు. ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన యువతి, తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని కోరింది. తీవ్ర పదజాలంతో ఆమెని దూషించాడు. అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
బ్లాక్‌మెయిల్
తనకు రూ.10 లక్షలు ఇస్తే మార్ఫింగ్ చేసిన ఫోటోలు డిలీట్ చేస్తానని లేకుంటే లైఫ్ నాశనం అవుతుందని బెదిరించాడు. దీంతో ఏ చెయ్యాలో ఆ యువతికి తెలీలేదు. ఆందోళనకు గురైన యువతి జరిగిన విషయాన్ని ఫ్యామిలీ సభ్యులకు వివరించింది. షాదీ డాట్ కామ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేయగా, అక్కడ కూడా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది.చివరకు బాధితురాలు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.