అతడి వయస్సు 46 ఏళ్లు. అమ్మాయిలతో డేటింగ్ చెయ్యాలని ఆశ. దీంతో ఓ రోజు పబ్‌కు వెళ్లాడు. అక్కడ ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తాను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని బిల్డప్ ఇచ్చుకున్నాడు. దీంతో ఆమె అతడికి దగ్గరైంది. కట్ చేస్తే.. తర్వాతి రోజు అతడు ఓ హోటల్ గదిలో నగ్నంగా నిద్రలేచాడు. అదే మంచం మీద ఓ యువతి దుస్తులు లేకుండా.. పడి ఉంది. ఆమె తనకు పరిచయమైన పబ్ అమ్మాయి కాదు. ఏమైందో తెలీక.. కంగారులో బట్టలు వెతుకుంటున్న సమయంలో.. యు ఆర్ అండ్ అరెస్ట్ అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు మొదలైంది అసలు కథ. ఈ విషయం అతడి భార్య వరకు చేరింది. కానీ, ఆమె చెప్పిన ఒక సమాధానం.. మొత్తం కథనే మార్చేసింది. అసలు ఏం జరిగిందో చదివితే.. ‘‘పెద్ద ప్లానింగే’’ అనడం పక్కా.
అసలు ఏమైంది?
కట్ చేస్తే అది హైదరాబాద్‌లో కూకట్ పల్లిలోని ఒక పబ్.. అమ్మాయిల పిచ్చితో 46 ఏళ్ల అకౌంటెంట్ అక్కడికి వెళ్లాడు. అక్కడే అతడికి 27 ఏళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తాను జ్యువెలరీ బిజినెస్ నడుపుతున్నానని తెలిపాడు. ఓ రోజు బాధితుడు బాగా తాగేశాడు. దీంతో ఆమె తన స్కూటర్‌పై బంజారాహిల్స్‌లో డ్రాప్ చేస్తానని చెప్పింది. దీంతో అతడు ఆమెతో బయల్దేరాడు. NFCL జంక్షన్‌కు చేరగానే ఓ ఎస్‌యూవీ అడ్డుకుంది. అందులో నుంచి దిగిన కొంతమంది దుండగులు అతడి కళ్లకు గంతలు కట్టి.. ఎస్‌యూవీలో తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత బలవంతంగా అతడి ఫోన్ స్వాధీనం చేసుకుని.. పాస్‌వర్డ్‌తో ఓపెన్ చేశారు. ఆ తర్వాత అతడికి మత్తు ఇచ్చారు.
ఉదయం లేచేసరికి..
ఆ తర్వాతి ఉదయం సుమారు 6 గంటల సమయంలో గుర్తుతెలియని ప్రాంతంలో అతడికి మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూసేసరికి అతడి శరీరంపై నూలు పోగు లేదు. అతడి పక్కనే ఉన్న అమ్మాయి పరిస్థితి కూడా అంతే. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయానికి టాస్క్ ఫోర్స్ పోలీసులమని కొందరు ఎంట్రీ ఇచ్చారు. ఆమెతో నువ్వు రాత్రంతా గడిపావంటూ.. అతడి ఫోన్లేనే రికార్డు చేసిన వీడియోలు, ఫొటోలు చూపించారు. దీంతో అతడు హడలిపోయాడు. అంతేకాదు.. ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయిందని, నువ్వే చంపేశావని ఆరోపించారు. వెంటనే రూ.10 లక్షలు ఇవ్వకపోతే ఆ ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తామని, ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వాళ్లు నకిలీ పోలీసులని బాధితుడికి అర్థమైంది.
డబ్బులు ఇచ్చి.. తప్పించుకొనే ప్రయత్నం
ఆ తర్వాత అతడు డబ్బులిచ్చి బయటపడాలని అనుకున్నాడు. తనని ఇంటికి తీసుకెళ్తే.. డబ్బులు ఇవ్వగలనని అన్నాడు. దీంతో అత్తాపూర్‌లో ఉన్న అతడి ఇంటికి తీసుకెళ్లారు. అతడితో ఒకరిని ఎస్కార్ట్‌గా పంపారు. అతడి ఫోన్, గోల్డ్ చైనును వారి వద్దే ఉంచుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన వచ్చిన తర్వాత తన దగ్గర అంత డబ్బులేదని చెప్పాడు. దీంతో నకిలీ పోలీసుల ప్లాన్ బెడిసికొట్టింది. కోపంతో ఆ ఫోన్లో రికార్డు చేసిన ఫొటోలు, వీడియోలను అతడి భార్యకు వాట్సాప్ చేశారు. ఈ ఫొటోలు బయటపడితే మీ కుటుంబం పరువు పోతుందని బెదిరించారు. దీంతో ఆమె ఊహించిన సమాధానం ఇచ్చింది. వాళ్లు నిజమైన పోలీసులే అనుకుని.. ‘‘నా భర్త నిజంగానే ఆమెను హత్య చేసి ఉంటే.. వెంటనే అరెస్ట్ చేయండి’’ అని తెలిపింది. దీంతో దుండగులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక వాళ్ల నుంచి డబ్బులు రావని అర్థం చేసుకుని ఎస్కేప్ అయ్యారు. ఇదంతా జులై 19న జరిగింది.
Also Read: 13 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. బతికి ఉండగానే నిప్పు పెట్టి.. కారణం అదేనా?
పోలీసులకు ఫిర్యాదు
బాధితుడు జరిగిన విషయాన్ని తన స్నేహితులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జులై 26న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతడు చెప్పిన వివరాలతో పోలీసులు మొత్తం ముఠాను అరెస్టు చేశారు. ఆ 27 ఏళ్ల యువతి ఆ పబ్బులో డ్యాన్స్ అని తేలింది. ఆమె భర్త ఆ పబ్‌లోనే బౌన్సర్ కమ్ ఇవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు బౌన్సర్, ట్రావెల్ ఏజెంట్ ఉన్నారు. బాధితుడి మంచంపై చనిపోయినట్లు నటించిన యువతి ఆచూకీ లభించలేదు. ఆమెకు డబ్బులు బాగా అవసరమని చెప్పిందని, రూ.15 వేలు ఇస్తే.. అలా నగ్నంగా పడుకుందని నిందితులు చెప్పారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు.. బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ కేఎం రాఘవేంద్ర తెలిపారు.