Hyderabad news : బస్సులో చివరి సీటులో కూర్చున్న ఓ పెద్ద మనిషి.. వెళుతూ వెళుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అలా ఒక్కసారిగా కిందపడిపోయో వరకు ఎవరికీ ఏం అర్థం కాలేదు. తీరా.. సాయం చేసేందుకు దగ్గరికి వెళ్లేలోగా… ప్రాణాలోదిలేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ శెట్టి బాలరాజు (63) అనే ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రయాణికులు వైద్య సాయం అందించే లోగానే కుప్పకూలి మరణించాడు. మెహిదీ పట్నం నుంచి శంకర్ పల్లికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కిన బాలరాజు.. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఉన్నట్లుండి.. అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్రమత్తమైన కండక్టర్ సహా తోటి ప్రయాణికులు గుండె పోటు వచ్చినట్లు గుర్తించారు.
ప్రయాణికుడి మృతి గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. గుండెపోటుకు గురైన వ్యక్తి గురించి ఆరా తీయగా.. మృతుడు రంగారెడ్డి జిల్లా జనవాడ గ్రామానికి చెందిన రైతు శెట్టి బాలరాజు (63)గా గుర్తించారు. రైతు మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇంకాసేపట్లో ఇంటికి చేరుకుంటాడు అనుకున్న మనిషి అనుకోని తీరుగా చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్న వ్యక్తి అలా ఎలా ఒరిగిపోయాడో అంటూ గుండెలు బాదుకుంటున్నారు.
Also Read : పబ్‌లో దొంగ.. పోలీసులనే కాల్చేశాడు.. చివరకు..?