Trading Fraud : అత్యాశతో రోజుల్లోనే కోట్లు సంపాందించాలని తప్పుడు ట్రేడింగ్ మోసంలో పాల్గొని ఓ వ్యక్తి ఏకంగా రూ.1.22 కోట్లు నష్టపోయాడు. చదువుకుని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ కూడా.. డబ్బుల ఆశ, ఎవరో చెప్పిన మాటలకు మోసపోతూ.. చివరాఖరికి పోలీసులను సంప్రదిస్తున్నారు. తమ సొమ్ముల్ని తిరిగి ఇప్పించాలంటూ లబోదిబోమంటున్నారు.
ఆశ ఉండడంలో తప్పు లేదు కానీ అత్యాశకు పోతేనే అసలకు మోసం వస్తుందని తరతరాలుగా ఉన్న నానుడే. పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పిన ఈ మాటలు నిజమే అని కొన్ని సంఘటనల్ని చూస్తుంటే అనిపిస్తుంటాయి. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ట్రేడింగ్ లో లాభాలు వచ్చేలా గైడెన్స్ ఇస్తాముంటూ నమ్మించి, తప్పుదారి పట్టింది.. ఏకంగా రూ.1.22 కోట్లను దర్జాగా దోచుకుపోయారు కేటుగాళ్లు. ఆలస్యంగా మోసాన్ని గుర్తించిన బాధితుడు.. పోలీసుల దగ్గరకు పరుగెత్తాడు. దాంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిందుతుల కోసం వేగంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ యూనిట్.. ట్రేడింగ్ మోసంలో పాల్గొన్న ఒక నిందితుడిని అరెస్టు చేసింది. అతనిపై దేశంలో 23 కేసులు నమోదైనట్లుగా గుర్తించారు. ఇతన్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంకిత్ అరోరా (38) అనే ప్రైవేట్ ఉద్యోగిగా గుర్తించారు. నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు, ఒక పాస్‌బుక్, వివిధ బ్యాంకు ఖాతాలకు చెందిన 11 డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు
ఈ కేసు వివరాల్ని వెల్లడించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబర్ క్రైమ్స్) కవిత.. సైబర్ మోసగాళ్లు నవ్యానంద్ అనే టెలిగ్రామ్ ఐడి ద్వారా సికింద్రాబాద్ కు చెందిన బాధితుడిని సంప్రదించినట్లుగా తెలిపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా భారీగా లాభాలు ఆర్జించవచ్చని నమ్మించిన మోసగాళ్లు.. స్టాక్స్ కొనేందుకు, విక్రయించేందుకు సాయం చేస్తామని నమ్మించారు.
కొన్ని రోజులు బాగానే నడిచినా… తర్వాత స్టాక్స్ లో మరింత ఆర్జించేందుకు పెట్టుబడులు పెట్టాలంటూ ట్రేడింగ్ అప్లికేషన్ల వైపు తప్పుదారి పట్టించారు. వారిని నమ్మిన హైదరాబాదీ వ్యక్తి.. వారు చెప్పినట్లుగా రూ. 1.22 కోట్ల మొత్తాన్ని వారు చెప్పినట్లుగా బదిలీ చేశాడు. ఆ డబ్బుల్ని వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టినట్లుగా నమ్మించారు. బాధితుడు యాప్ లో చూపించిన విధంగా.. కొన్ని పెట్టుబడుల్ని విత్ డ్రాలు చేసుకునేందుకు ప్రయత్నించినా.. వివిధ కారణాలతో తిరస్కరించారు.
అప్పటికే భారీగా డిపాజిట్ చేసిన బాధితుడి నుంచి మరింత వసూలు చేసేందుకు ప్రయత్నించిన కేటుగాళ్లు.. మరింత మొత్తం డిపాజిట్ చేయాలని, లేదంటే ఇప్పటికే డిపాజిట్ చేసిన డబ్బులు పోతాయని బెదిరింపులకు సైతం దిగారు. పైగా.. క్రమంగా పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అన్ని మార్గాలు క్లోజ్ అవుతాయని, వినియోగదారు ఐడీ బ్లాక్ అవుతుందని భయపెట్టారు.
మోసగాళ్ల చేతిలో మోసపోయాయని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు.. పోలీసుల్ని సంప్రదించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ క్రైమ్స్ చట్టంలోని సెక్షన్ 66 C, D IT యాక్ట్-2008, సెక్షన్ 384, 419, 420, 467, 468, 471 IPC కింద కేసు నమోదు చేశారు.
ఎలా మోసం చేస్తారంటే
హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు అంకిత్ అరోరా.. ఈ మోసంలో అసలు సూత్రదారి అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీపక్ కుమార్‌కు ఖాతాలను సరఫరా చేస్తుంటాడు. అంటే.. అతనికి, అతని బృందానికి అమాయకులైన వ్యక్తుల్ని పరిచయం చేసి.. వారి దగ్గర నుంచి కమీషన్ తీసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం అసలు నిందితుడైన దీపక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. NCRP డేటా ప్రకారం, నిందితుడు దేశంవ్యాప్తంగా ఇలాంటి ట్రేడింగ్ మోసాలపై నమోదైన 23 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పైగా.. అతని బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ. 6 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితులు ఒక వ్యవస్థీకృత
ముఠాగా ఏర్పడి, ట్రేడింగ్ చిట్కాలు అందిస్తామనే నెపంతో అమాయక ప్రజలను మోసం చేశారు. దీపక్ కుమార్ థాయిలాండ్ లో ఉన్నట్లు తెలుస్తోందని, అతని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.
1. అధిక డబ్బు ఆశ చూపించి ఉన్న మొత్తాల్ని లాగేసే ఇలాంటి ప్రకటనలు, వీడియోల్ని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
2. టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చాలా మంది నకిలీ పెట్టుబడి గ్రూపులు కనిపిస్తుంటాయని.. వాటిని సాధ్యమైనంత దూరంగా ఉండాలని చెబుతున్నారు.
3. ఎప్పుడూ తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి ఆశ చూపించే హామీలను నమ్మొద్దని, అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టొద్దని చెబుతున్నారు.
4. మీరేదైన స్టాక్స్, ఇతర పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఎల్లప్పుడూ SEBI ఆమోదించబడిన యాప్‌లను ఉపయోగించాలని, పెట్టుబడి పెట్టే ముందు SEBI రిజిస్టర్డ్ ఆర్థిక సలహాదారులు పరిశీలించాలని చెబుతున్నారు.
5. మిమ్మల్ని నమ్మించేందుకు, వాళ్లు చెప్పేది నిజం అని నిరూపించేందుకు.. మీ ఖాతాల్లో మొదట్లో కొంత అమౌంట్ కూడా జమ చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత మీ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు కోరతారని.. అలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
6. తెలిసో, తెలియకో ఎవరైనా సైబర్ క్రైమ్ మోసానికి గురైతే.. బాధితులు వెంటనే 1930 కు డయల్ చేయాలని, లేదంటే cybercrime.gov.in ని సందర్శించి, ఫిర్యాదు నమోదు చేయాలని చెబుతున్నారు.