Sister-Brother Suicide: హైదరాబాద్ కు చెందిన అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. వారణాసిలోని ఓ హోటల్‌లో ఈ దారుణం జరిగింది. మృతులు లక్డీకాపూల్ కు చెందిన గణేష్ గౌడ్ అతని సోదరి లక్ష్మీదేవిగా గుర్తించారు. నాలుగు రోజులుగా వారణాసిలోని కాంట్ ప్రాంతంలో సిట్ ఇన్ హోటల్లో బస చేశారు. దీనిపై వారణాసి పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.
వారణాసిలోని ఓ హోటల్‌లో దారుణం
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ప్రాంతానికి చెందిన గణేష్ గౌడ్ అతని సోదరి లక్ష్మీదేవి వారణాసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారణాసిలోని కాంట్ ప్రాంతంలోని బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ సిబ్బంది చెక్ అవుట్ నియమాల గురించి తెలియజేయడానికి వారికి ఫోన్ చేశాడు.
వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరకు గది తలుపు తీయడానికి ఎంత ప్రయత్నించినా తెరవకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపు తెరిచారు. అప్పటికి అన్నా-చెల్లెలు నోటి నుండి నురగ వస్తూ విగత జీవులుగా పడి ఉన్నారు. గదిలో విషం తీసుకున్న బాటిల్ లభ్యం కావడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు పోలీసులు.
హైదరాబాద్‌కి చెందిన అన్న-చెల్లి ఆత్మహత్య
అన్నా-చెల్లి ఆత్మహత్య చేసుకున్నారా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అక్కడి పోలీసులు. వారణాసిలోని కాశీవిశ్వనాథ్‌ని దర్శించుకునేందుకు వచ్చినట్టు ఆ ప్రాంత డీసీపీ కాశీ గౌరవ్ తెలిపారు. సందర్శనం తర్వాత ఇంటికి వెళ్లడానికి రైలు ఎక్కాల్సి ఉంది. ఇంతలో వారిద్దరు తమ ప్రాణాలను తీసుకున్నారు.
ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించింది. ఇద్దరు నాలుగు రోజుల కిందట హోటల్‌కి వచ్చినట్టు సిబ్బంది తెలిపారు. హోటల్‌లో వారిచ్చిన చిరునామాలతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. గదిలో వివిధ మందులు, రూ. 2 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: వీడియో కాల్ చేసి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో 1.07కోట్లు టోకరా!
ఇద్దరూ విషం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోటల్ రిజిస్టర్‌లో ఉన్న గుర్తింపు కార్డుల చిరునామా 12 ఏళ్ల నాటివని తెలిపారు. మృతుడి నుంచి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.