BT-3 Seeds: స్వేచ్ఛ బ్యూరో: నిషేధిత BT-3 పత్తి విత్తనాల అక్రమ రవాణాపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. షామీర్‌పేట్ ORR ఎగ్జిట్ నంబర్-07 సమీపంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 100 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా చెబ్రోలు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసరావు(58) అక్రమంగా BT-3 పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో ఎస్‌వోటీ కంటోన్మెంట్ బృందం, షామీర్‌పేట్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిందితుడి వద్ద రెండు సంచుల్లో మొత్తం 100 కిలోల నిషేధిత విత్తనాలు గుర్తించారు. ఒక్కో సంచిలో 50 కిలోల చొప్పున విత్తనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో పరారీలో ఉన్న దాసరి సూరిబాబు, అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన మరో శ్రీనివాసరావుతో కలిసి తక్కువ ధరలకు విత్తనాలు కొనుగోలు చేసి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రైతులు, ఎరువుల దుకాణాలకు అధిక ధరలకు విక్రయించేందుకు యత్నించినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: వాషింగ్ మిషన్ వాడుతున్నారా? మీరు చేసే ఈ చిన్న తప్పు.. బట్టలను పనికిరాకుండా చేస్తున్నాయ్!
ఇప్పటికే దాసరి శ్రీనివాసరావుపై వికారాబాద్ జిల్లా యాలాల్ పోలీస్‌స్టేషన్‌లో ఇదే తరహా కేసు నమోదై ఉన్నట్లు తెలిపారు. నిషేధిత, నకిలీ విత్తనాల వినియోగంతో భూమి కాలుష్యం, పంట నష్టాలు, రైతులకు భారీ ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై షామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: బడ్జెట్ ధరలో టచ్ స్క్రీన్ ల్యాప్‌టాప్ కావాలా? అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!