Tirupati Crime: నేటి కాలంలో సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. కేవలం కొన్ని లైక్స్, కామెంట్స్ కోసం యువత తమ విలువైన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే తిరుపతి జిల్లా తడ మండలంలో చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులారిటీ సంపాదించాలనే తాపత్రయంతో, రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ ఇద్దరు యువకులు నిండు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు సమీపంలో ఈ ఘోర కలివిడి చోటుచేసుకుంది. మృతులను పేర్నాడు గ్రామానికి చెందిన సునీల్, పిండిపాలెం గ్రామానికి చెందిన కళ్యాణ్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులని, ఎప్పుడూ కలిసే ఉండేవారని సమాచారం. సోమవారం ఉదయం కొండూరు వద్ద రైలు పట్టాలపై వీరి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
అయితే.. ఈ మరణాల వెనుక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి ఉందనే ప్రచారం సాగుతోంది. యువకులు పట్టాలపై రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా లేక కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిన్నటి వరకు తమ కళ్లముందే తిరిగిన యువకులు ఇలా విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: భూపాలపల్లిలో దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ!