Jeedimetla Murder case: బంధాలకు అర్థం లేకుండా పోయింది. ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఆలోచన లేక కొందరు.. ఆవేశంలో ఇంకొందరు. బంధాలను పక్కనపెట్టి బరితెగిస్తున్నారు. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. జీడిమెట్లలో కన్నతల్లినే కూతురు కడతేర్చిన ఘటన.. కలకలం సృష్టించింది. తన ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో.. ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. ఈ దారుణమైన ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
అత్యంత పాశవికంగా తల్లిని చంపేసిన కూతురు
16 ఏళ్ల కూతురు. పదో తరగతి విద్యార్థిని. ఆకర్షణకు, ప్రేమకు.. పెద్దగా తేడా తెలియని వయసు. కానీ.. ప్రేమ వ్యవహారంలో తల్లి మందలించిందన్న కోపంతో.. ప్రియుడితో కలిసి ఆ తల్లినే హతమార్చింది. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది. తల్లి గొంతు నులిమి, తలపై రాడ్డుతో కొట్టి.. అత్యంత పాశవికంగా తల్లిని చంపేసింది ఆ కూతురు. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. మానవ సంబంధాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసింది.
నల్గొండకు చెందిన శివతో.. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు పరిచయం
8 నెలల కిందట నల్గొండకు చెందిన శివతో.. ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. ప్రేమకు దారి తీసింది. దాంతో.. పదో తరగతికే ప్రేమ ఏంటని.. తల్లి అంజలి మందలించింది. దాంతో.. బాలిక వారం కిందట.. ప్రియుడు శివతో వెళ్లిపోయింది. దాంతో.. తన కూతురు కనిపించడం లేదని తల్లి అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 3 రోజుల క్రితమే.. పెద్ద కూతురు ఇంటికి తిరిగొచ్చింది. తల్లి అడ్డు తొలగించుకునేందుకు.. ప్రియుడితో కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేసింది. సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన బాలిక ప్రియుడు శివ.. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా.. వెనక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో.. ఆమె ముఖాన్ని కప్పేసి.. ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత సుత్తి తీసుకొని.. అంజలి తలపై కొట్టారు. శివ తమ్ముడు యశ్వంత్.. అంజలి గొంతు కోయడంతో.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంజలిని హత్య చేసిన తర్వాత.. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ముగ్గురు నిందులను అదుపులోకి తీసుకున్నారు
కన్నతల్లిని కూతురు కర్కశంగా చంపేసిన కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పెద్ద కూతురే తల్లి హత్యకు ప్లాన్ చేసినట్లుగా అంగీకరించింది. నిందితురాలు చెబుతేనే హత్య చేశాను అని ప్రియుడు నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. మర్డర్‌కి ముందుగానే ఇద్దరి కలిసి ప్లాన్ చేసినట్లుగా నేరాన్ని అంగీకరించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈరోజు కోర్టులో వీరిద్దరిని హాజరుపరిచే అవకాశం ఉంది.
తల్లి చనిపోయిందనే బాధ.. తన అక్కకు ఏమాత్రం లేదని చెల్లి ఆవేదన
తన అక్క చేతిలోనే తల్లి అంజలి హత్యకు గురవడంతో.. రెండో కూతురు కన్నీరుమున్నీరవుతోంది. అమ్మను చంపిన అక్కతో పాటు ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్‌ని ఉరి తీయాలంటోంది. శివ ఎలా చెబితే అక్క అలా చేసిందని.. ఆమెకు కొంచెం కూడా కనికరం లేదని చెప్పింది. తల్లి కొన ఊపిరితో ఉండటంతో.. శివకు ఫోన్ చేసి ఇంకా బతికే ఉందని చెప్పిందని.. వాళ్లు వచ్చి మళ్లీ తన తల్లి తలపై సుత్తితో కొట్టారని చెబుతోంది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే.. వాళ్లు వెళ్లిపోయారని, తల్లి చనిపోయిందనే బాధ.. తన అక్కకు ఏమాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తన ప్రేమను కోల్పోతాననే భయంతోనే.. కూతురు ఇలా చేసిందా?
తెలిసీ, తెలియని వయసులో ప్రేమలో పడటం, ఆ ప్రేమ కోసం తల్లినే చంపడమనేది.. దారుణమైన ఘటన. తన ప్రేమను కోల్పోతాననే భయంతోనే.. కూతురు ఇలా చేసిందా? లేక.. ఆ అమ్మాయి మానసిక సమస్యలతో బాధపడుతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రియుడిని కోల్పోతాననే ఆందోళన, సమాజం తనను దూరం చేస్తుందేమోనన్న భయమే.. కూతురిని ఈ ఘాతుకానికి పురికొల్పి ఉండొచ్చంటున్నారు. అంతేకాదు.. ప్రియుడి ప్రోత్సాహం, కుట్రలో భాగం కావడం లాంటివి కూడా ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాడని కారణం కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇలాంటి దారుణమైన సంఘటనలు సమాజంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతాయ్. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన బంధంపై నమ్మకం కోల్పోయేలా చేస్తాయ్. కుటుంబ వ్యవస్థలు బలహీనపడటానికి దారితీస్తాయి.