Gadwal Tragedy: గ్రామంలోకి స్కూల్ బస్సు వస్తే.. చిన్నారులు అందరూ ఆశగా ఎదురుచూస్తుంటారు. తమ అన్నలు, అక్కలు స్కూల్ నుంచి ఇంటికి బస్సులో వచ్చే సమయంలో వాళ్ల కళ్లలో కనిపించే ఆనందం అంచనాలు లేనిది. కానీ ఆ సంతోషమే ఒక కుటుంబానికి శాశ్వత విషాదాన్ని మిగిల్చింది. ఆడుకుంటూ సంతోషంగా బస్సు దగ్గరకు వెళ్లిన చిన్నారి, ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు కింద పడి కన్నుమూసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం శనగపల్లి గ్రామానికి చెందిన రేవంత్ అనే ఆరేళ్ల బాలుడు తన అక్కతో కలిసి శాంతినగర్ పట్టణంలోని సరస్వతీ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. నర్సరీలోనే చదువుతున్న ఆ చిన్నారి ఈ రోజు స్కూల్ కి వెళ్లలేదు. కానీ సాయంత్రం స్కూల్ బస్సు వచ్చి ఆగినప్పుడు… సంతోషంగా తన అక్కను చూసేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. బస్సు ఆగి పిల్లలు దిగుతుండగా… డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు ముందుకు వెళ్లడం.. దానికితోడు క్లీనర్ కూడా లేకపోవడం విషాదానికి కారణమైంది.
Also Read: Magnetic Hill: ఇక్కడ వాహనాలు వాటికవే కదులుతాయి.. ఈ వింత ప్రదేశంపై పరిశోధకులు ఏం చెప్పారంటే?
చక్రాల కింద పడి రేవంత్ అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆడుకుంటూ కళ్ల ముందే విలవిల లాడుతున్న కొడుకుని తీసుకుని వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడి వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ వార్త వినగానే గ్రామంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటితో విలపిస్తుంటే… గ్రామస్తులు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఒక్క నిర్లక్ష్యం కారణంగా ఆడుకుంటూ ఉన్న బిడ్డని కోల్పోవాల్సి రావడం, తల్లిదండ్రుకు ఆ చిన్నారిని దూరం చేసింది.
ఘటన తెలిసిన ప్రజాసంఘాల నాయకులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతినగర్ పట్టణంలో బాలుడి మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. స్కూల్ బస్సులో క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. అంతేకాదు, ప్రమాదం జరిగిన తర్వాత కూడా స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాసంఘాల నాయకులు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ప్రజల ఆగ్రహం మరింత ఉధృతమవుతుందనే ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.