Magnetic Hill : వాహనాలు నడపాలంటే పెట్రోల్, డీజల్ తప్పనిసరి. అంతేకాదు ఆ రెండు ఉండి కూడా వాహనం నడిపేవారు కూడా ఉండాలి. లేకపోతే వాహనం ముందుకు కదలదు. అయితే డైవర్ లేకుండా, మనం నడపకుండానే వాహనం కదిలితే ఎలా ఉంటుంది. నమ్మడానికి కాస్త వెరైటీగా అనిపించినా ఇది నిజం. నేను చెప్పేది మాగ్నెటిక్ హిల్ గురించి. ఈ హిల్ పేరు వింటేనే ఒక రహస్యమైన ఆకర్షణ కలుగుతుంది. సాధారణంగా ఏ వాహనాన్నైనా పైకెక్కించాలంటే ఇంధనం లేదా వాహనంలో కూర్చొని బలంగా శక్తిని ఉపయోగించాలి. కానీ లడాఖ్‌లోని లేహ్ సమీపంలో ఉన్న ఈ మాగ్నెటిక్ హిల్ వద్ద వాహనాలు ఎలాంటి శక్తి లేకుండానే పైకెక్కుతున్నట్లు కనిపిస్తాయి. రోడ్డుపై వాహనాన్ని ఆపి న్యూట్రల్‌లో పెడితే చాలు.. వాహనాలు నెమ్మదిగా కొండపైకి కదులుతున్నట్లు ఉంటుంది. ఈ అనుభవం చూసిన వారికి నిజంగా ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.
Read also: Effects of Makeup: ప్రతిరోజూ మేకప్ వేసుకుంటున్నారా? అయితే మీ చర్మానికి ముప్పే!
అయితే, ఈ ఘటన వెనక ఉన్న నిజం ఏమిటి? ప్రజలు దీన్ని మాయగా, దేవుని శక్తిగా, లేదా కొండల్లో దాగి ఉన్న అద్భుత గుణంగా అంటున్నారు. కానీ శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం మాత్రం వేరే. వాస్తవానికి ఇది మాగ్నెటిక్ ఆకర్షణ కాదని, ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అంటే మన కళ్లకు మోసం చేసే మాయని వారు నిరూపించారు. ఆ ప్రాంతంలో ఉన్న భూభాగం, కొండల వంగిన తీరు, ఆకాశం-భూమి కలిసే రేఖల మాయ కలిపి మన కళ్లకు వాహనం కదులుతున్నట్లు తప్పుగా చూపిస్తాయి. ఎక్కుతున్నట్లు కనిపించే రహదారి నిజానికి కిందికి వాలుగా ఉంటుంది. కాబట్టి వాహనం తనంతట తానే కిందికి కదులుతుంటే, మనకు అది పైకి కదులుతున్నట్లు అనిపిస్తుంది.
ఈ రహస్యమంతా మనం చూసే తీరునుబట్టి, కదిలే కదలిక మన భ్రమని శాస్త్రవేత్తలు చెప్పినా, మాగ్నెటిక్ హిల్‌కి వచ్చే సందర్శకులు మాత్రం దాన్ని ఒక అద్భుతంగా భావిస్తూనే ఉంటారు. అక్కడికి వచ్చే పర్యాటకులు కార్లు, బైకులు ఆపి స్వయంగా ఈ అనుభవాన్ని చూస్తారు. చాలా మంది మొదటిసారి చూసినప్పుడు నమ్మలేరు. ఇది కేవలం లేహ్‌లోనే కాదు, ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి “గ్రావిటీ హిల్స్” ఉన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇలాంటి కంటికి మోసం చేసే కొండలు ఉన్నాయి. అయినా లేహ్ మాగ్నెటిక్ హిల్ ప్రత్యేకత ఏమిటంటే, అది హిమాలయాల మధ్యలో, సుందరమైన ప్రకృతి దృశ్యాలతో ఉండటమే. ఆ రహస్యాన్ని తెలిసినా, చూసే అనుభవం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. మాగ్నెటిక్ హిల్ మనకు ఒక పాఠం చెబుతుంది. మన కళ్ళతో చూసిన ప్రతిదీ నిజం కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రకృతి మన కళ్లను కూడా మోసం చేస్తుందని ఇదే నిదర్శనం.