Karimnagar: కరీంనగర్ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ గ్రామ పరిధిలో కన్నతండ్రే కాలయముడిగా మారి తన ఇద్దరు కవల కుమార్తెలను అత్యంత క్రూరంగా అంతమొందించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన సదరు వ్యక్తి చిన్నారులను బావిలో పడేసి ప్రాణాలు తీసిన తీరు స్థానికులను కలచివేస్తోంది. ఈ ఘోరకలికి పాల్పడిన వ్యక్తిని గచ్చు శ్రీశైలంగా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. శ్రీశైలం అనే వ్యక్తికి తన భార్యతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీశైలం తన ఐదేళ్ల వయస్సున్న కవల కుమార్తెలకు విషపూరితమైన గడ్డి మందు తాగించాడు. ఆపై నిర్దాక్షిణ్యంగా వారిద్దరినీ సమీపంలోని బావిలోకి తోసివేశాడు. అభం శుభం తెలియని చిన్నారులు ఆ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
చిన్నారులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు బావి వద్దకు వెళ్లి చూడగా ఒక కుమార్తె మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఒక కూతురు మృతదేహం లభ్యం కాగా మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన శ్రీశైలంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలు ఎంతటి తీవ్రస్థాయికి చేరినా కన్నబిడ్డలను చంపుకోవడం పట్ల సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో జూబ్లీ నగర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: కల్లు.. డిప్రెషన్ టాబ్లెట్లు.. డ్రగ్స్, క్వాక్ పబ్ కేసులో సంచలన విషయాలు