సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్దతులలో రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ కు వచ్చిన లింక్ ను క్లిక్ చేయడంతో తన అకౌంట్లోని డబ్బులన్నీ మాయం అయ్యాయి. ఆయన వాట్సాప్ కు వెంటనే కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ కెనరా బ్యాంక్ పంపినట్లు ఓ లింక్ పంపించారు. వెంటనే కేవైసీ అప్ డేట్ చేసుకోకపోతే అకౌంట్ క్లోజ్ అవుతుందని హెచ్చరించారు. సదరు వ్యక్తి నిజమేనని నమ్మి లింక్ ఓపెన్ చేశాడు. కాసేపట్లోనే ఆయన అకౌంట్ లో ఉన్న రూ. 6.6 లక్షలు మాయం అయ్యాయి. ఓటీపీ చెప్పకపోయినప్పటికీ డబ్బులు కొల్లగొట్టారు దుండగులు.
వాట్సాప్ APK ఫైల్ స్కామ్ లో ఏం జరిగిందంటే?
బాధితుడికి ఓ వాట్సాప్ గ్రూప్ లో ఫేక్ కెనరా బ్యాంక్ మెసేజ్ వచ్చింది. సదరు వ్యక్తి ‘దుర్గి క్రికెట్ ఉత్సవ’ అనే వాట్సాప్ గ్రూప్ లో ఉండేవాడు. తాజాగా ఆ గ్రూప్ పేరు ‘కెనరా బ్యాంక్’గా మారింది. ఈ గ్రూప్ లో APK లింక్ ద్వారా UIDAI, KYC వివరాలను అప్ డేట్ చేయాలని, చేయకపోతే కెనరా బ్యాంక్ లో ఉన్న అకౌంట్లు బ్లాక్ చేయబడుతాయని మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసిన సదరు వ్యక్తి APK ఫైల్ ని డౌన్ లోడ్ చేశాడు. ఇది బ్యాంక్ ఇంటర్ ఫేస్ లోకి తీసుకెళ్లింది. ఆ పేజీలో మొబైల్ నంబర్, UIDAI నంబర్, ATM పిన్, CVVతో సహా పూర్తి వివరాలను అడిగింది. ఈ సమాచారాన్ని ఎంటర్ చేయగానే బాధితుడి మొబైల్ ఫోన్ కు ఓటీపీలు వచ్చాయి. అయితే, తన ఫోన్ కు వచ్చిన ఓటీపీలను సైబర్ నేరగాళ్లకు చెప్పనప్పటికీ, అతడి అకౌంట్ నుంచి ఏకంగా రూ. 6.6 లక్షలు మాయం అయ్యాయి. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరులోని కావూరు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
Read Also: 4 లక్షల కోట్ల ఫార్మా సామ్రాజ్యానికి వారసురాలు, ఇంతకీ ఎవరీ విధి శాంఘ్వీ?
ఇంతకీ APK మాల్వేర్ అంటే ఏంటి?
APK మాల్వేర్ అనేది WhatsApp ద్వారా బాగా సర్క్యులేట్ అవుతున్నది. ఈ మాల్వేర్ తో చాలా డేంజరస్. బ్యాంకు అకౌంట్ కేవైసీలు అప్ డేట్ చేసుకోవాలి. లక్కీ డ్రాలో గెలుపొందారంటూ మోసపూరిత సందేశాలను ఈ ప్రమాదకరమైన APK ఫైల్ ద్వారా పంపిస్తారు. ఈ మెసేజ్ లు అచ్చం నిజమైన బ్యాంకులు పంపినట్లుగానే ఉంటాయి. ఒకవేళ ఈ లింక్ ను క్లిక్ చేస్తే మోబైల్ లోని కీలక సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీ అకౌంట్లలోని డబ్బులను మాయం చేయడంతో పాటు ఇతరత్రా వేధింపులకు దిగుతారు. దొరికినన్ని డబ్బులు దోచుకుంటారు. అందుకే, వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ అయ్యే మోసపూరిత మెసేజ్ లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓపెన్ చేయడం, డౌన్ లోడ్ చేయడం లాంటివి చేయకూడదంటున్నారు నిపుణులు.
Read Also: పాప్ కార్న్.. పాత కారు.. ముట్టుకుంటే బేజారు, అట్లుంటది నిర్మలమ్మతో!