Mahabubabad: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం చదువు విషయంలో తల్లి మందలించిందన్న చిన్న కారణంతో ఓ నిండు ప్రాణం బలవ్వడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
గార్ల మండలం పూసల తండాకు చెందిన రాందాసు, స్వరూప దంపతుల చిన్న కుమారుడు పవన్ (10). స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పవన్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11వ తేదీన పాఠశాలకు వెళ్లాలని తల్లి పవన్‌ను మందలించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ బాలుడు, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు.
మందు తాగిన విషయాన్ని పవన్ ఎవరికీ చెప్పలేదు. అయితే మరుసటి రోజు నుంచి బాలుడికి విపరీతమైన వాంతులు కావడం, జ్వరం రావడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. వారు గట్టిగా నిలదీయగా, తాను గడ్డి మందు తాగినట్లు పవన్ అంగీకరించాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృత్యువుతో పోరాడి..
అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పవన్, చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికందిన కొడుకు కళ్ల ముందే ప్రాణాలు వదలడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మా కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శల దాడి