Vizag Bus Fire విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రిషికొండ బీచ్ సమీపంలో మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.
ఓంకార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను వారి గమ్యస్థానాల్లో దించి తిరిగి వస్తుండగా.. రిషికొండ బీచ్ రోడ్డు సమీపంలో బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. టైర్ పేలిన వేగానికి ఘర్షణ ఏర్పడి నిప్పుకణికలు చెలరేగాయి. ఆ మంటలు చూస్తుండగానే బస్సు ఇంజిన్ భాగానికి, ఆపై ఇతర భాగాలకు వేగంగా వ్యాపించాయి.
బస్సు టైర్ పేలిన వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించారు. బస్సును వెంటనే రోడ్డు పక్కన నిలిపివేసి కిందకు దిగిపోయారు. మంటలు నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సాధారణంగా రిషికొండ ప్రాంతం పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రమాదం బస్సు నిండా ప్రయాణికులు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఫలితం చాలా తీవ్రంగా ఉండేది. ప్రయాణికులందరినీ దింపేసిన తర్వాతే ఈ ప్రమాదం జరగడం అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు అస్థిపంజరంలా మారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, బస్సులో ఏవైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టారు.