Non Veg Brother Murder| మద్యం సేవించిన వ్యక్తి అపస్మారక స్థితిలో చేసిన పని అతని ప్రాణం తీసింది. కుటుంబ సభ్యులే అతడిని చంపేసి.. ఏం జరగనట్లు నటించారు. అతను ఆత్మ హత్య చేసుకున్నట్లు నాటకమాడారు. అయినా పోలీసులు నిజం తెలుసుకున్నారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో అంశుల్, అతని ఇద్దరు సోదరులు అమన్, కుల్దీప్, తల్లి ఇందిరా దేవితో కలిసి నివసిస్తున్నాడు. అయితే వారి కుటుంబంలో అందరూ శాఖాహారులే. ముగ్గురు అన్నదమ్ములు లేబర్ పనిచేసుకొని జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో అంశుల్ మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. అందుకోసం ఎక్కువగా ఇంట్లో కాకుండా బయట స్నేహితులో కలిసి తిరిగేవాడు. అలా అతను స్నేహితుల ప్రభావం కారణంగా మాంసాహారం కూడా తినడం ప్రారంభించాడు. అంశుల్ కు మద్యం వ్యసనంలా మారింది. దీంతో అతను రోజూ రాత్రివేళ ఇంటికి తాగి వచ్చేవాడు. అతను బయట మాంసాహారం కూడా తింటున్నట్లు మద్యం మత్తులో ఇంట్లో చెప్పేశాడు.
Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్
ఈ కారణంగా ఇంట్లో అతని ఇద్దరు సోదరులు అతడిని చితకబాదారు. కానీ అంశుల్ తల్లి అడ్డుపడి.. అతడిని ఇంటి బయటే ఏమైనా తినాలని.. ఇంటి లోపలికి మాంసాహారం తీసుకురాకుడదని హెచ్చరించింది. అయినా అంశుల్ తల్లి చెప్పిన మాట వినలేదు.
గత శుక్రవారం రాత్రి అంశుల్ మద్యం సేవించి.. ఇంటికి చికెన్ పార్సిల్ తీసుకొచ్చాడు. ఇది చూసిన సోదరులు అతడిపై కోపడ్డారు. అయినా అంశుల్ వారిని లెక్కచేయకుండా కిచెన్ లోకెళ్లి ప్లేటు తెచ్చుకొని వారి ముందే చికెన్ తింటూ కూర్చున్నాడు. అంతటితో ఆగక వారికి చికెన్ చూపిస్తూ.. తనకు మాంసాహారం అంటే ఇష్టమని.. తన ఇంట్లో తనను ఎవడు ఆపుతాడని వారిని రెచ్చగొట్టాడు. దీంతో అంశుల్ సోదరులు అమన్, కుల్దీప్ ఇద్దరూ అతడిని కొట్టారు. అంశుల్ కూడా వారిని తిరిగి కొట్టాడు. దీంతో శాఖాహారులమైన తమ కుటుంబ పరువుని తీస్తున్నాడని భావించిన అమన్, కుల్దీప్.. అంశుల్ మెడకు తాడు బిగించి చంపేశారు.
కాసేపటి తరువాత వారి తల్లి ఇందిరా దేవి అక్కడికి వచ్చింది. జరిగినదంతా తెలుసుకొని.. ఒక ప్లాన్ వేసింది. వెంటనే అంశుల్ శవాన్ని తీసుకొని ముగ్గురూ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ అంశుల్ ఉరివేసుకున్నాడని అబద్ధం చెప్పారు. కానీ డాక్టర్లు అంశుల్ చనిపోయాడని ధృవీకరించారు. కానీ డాక్టర్లకు అంశుల్ శరీరంపై గాయాలు కనిపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అంశుల్ శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం నివేదికలో అంశుల్ హత్య చేయబడ్డాడని తేలింది. అతడిని చితకబాదిన తరువాత తాడుతో గొంతు బిగించారని నివేదికలో వెల్లడైంది. దీంతో పోలీసులు అంశుల్ సోదరులు, తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంశుల్ తల్లి హత్యకు ఉపయోగించిన ఆయుధం.. తాడుని దాచిపెట్టినందుకు ఆమె కూడా హంతకులకు సహకరించిందని పోలీసులు కేసు నమోదు చేశారు.