Mancherial Crime: ఆ ఇంట కుటుంబ కలహాలు తారా స్థాయికి చేరాయి. చివరకు కన్నతండ్రి పాలిట కన్న కొడుకే కాలయముడయ్యాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఆవిడపు రాజన్న (45) నివసిస్తున్నారు. ఈయనకు సాయి సిద్ధార్థ్ అనే కుమారుడు కలడు. రోజూ ఇంట్లో ఏదొక రూపేణా ఘర్షణ తలెత్తేది. దీనితో పలుమార్లు తండ్రి రాజన్న, కుమారుడు సాయి సిద్ధార్థ్ మధ్య పలుమార్లు వివాదం తలెత్తేది. ఈ దశలో తాజాగా తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ సాగింది. దీనితో ఆగ్రహం కట్టలు తెంచుకున్న సాయి సిద్ధార్థ్ అందుబాటులో ఉన్న వస్తువుతో తండ్రిపై బలంగా కొట్టాడు. దీనితో రాజన్న తలకు తీవ్రగాయమైంది. ఇంట్లో ఎక్కడ చూసినా తీవ్ర రక్తస్రావం కాగా, కుటుంబసభ్యులు జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు.
Also Read: DEET Telangana APP: మీకు జాబ్ కావాలా.. వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేయండి!
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే తండ్రిని హత్య చేసిన తనయుడు సాయి సిద్ధార్థ్ నేరుగా జైపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి, లొంగిపోయినట్లు సమాచారం. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు, కుటుంబ సభ్యుల ద్వార వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆవేశం అనర్థదాయకం అంటారు పెద్దలు. అలా ఆవేశంతో సహనం కోల్పోయిన సిద్దార్థ్, ఏకంగా తన తండ్రిని చంపి జైలుకు పాలయ్యే పరిస్థితి వచ్చిందని స్థానికులు తెలిపారు. తండ్రిని తనయుడు హత్య చేసినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు.