Manipur Violence: మణిపూర్ లో మరోసారి హింస చెలరేగుతోంది. శనివారం ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంఫాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు సీఎం బీరెన్ సింగ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం సీఎం ఇంట్లో లేరని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రుల ఇండ్లపైనా దాడి చేశారు. ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. భద్రతా బలగాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Also read: కొడాలి బూతులను సహించలేకపోతున్నా.. లా విద్యార్థిని ఫిర్యాదు.. అరెస్ట్ తప్పదా?
ఆందోళనల నేపథ్యంలో ఐదు జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అంతే కాకుండా ఇంటర్ నెట్ సేవలను నిలిపివేసింది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మైతీ తెగకు చెందిన ఇద్దరు పిల్లలు ఒక మహిళ సహా ఆరుగురు జీరి నదిలో శవాలుగా తేలారు. శుక్రవారం సాయంత్రం వారి మృతదేహాలు నదీ సమీపంలో కనిపించాయి. జిరిబామ్ లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు కొంతమంది మహిళలను, పిల్లలను అపహరించారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్ లో పదిమంది మిలిటెంట్లు మరణించారు.
ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మలిటెంట్లు అపహరించి అతి దారుణంగా చంపడంతో మైతీలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనలపై స్పందించిన కేంద్రం శాంతిభద్రతల పునరుద్ధరణకు భద్రతాబలాగాలు అవసరమైన చోట చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి. ఇదిలా ఉంటే గతేడాది మే మొదటి వారంలో రెండు జాతుల మధ్య వైరం మొదలైంది. ఈ హింసకు కారణం రెండు జాతుల మధ్య బీజేపీ పెట్టిన రిజర్వేషన్ చిచ్చే అనే ఆరోపణలు ఉన్నాయి. హింసను ఆపేందుకు కానీ, ప్రజలను శాంతిపజేసేందుకు కానీ ప్రధానీ మోడీ ఎప్పుడూ కృషి చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.