Kodali Nani: ఏపీలో అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై, సోషల్ మీడియాలో కించపరుస్తూ, దూషిస్తూ పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మాట్లాడినవారిపై సైతం కేసులు బుక్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను జైలుకు పంపారు. మరికొంతమంది అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. అదే విధంగా కడప జిల్లాలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.
Also read: కారు.. కిస్సా కల్లాస్.. జిల్లాలకు జిల్లాలే ఖాళీ!
నోటీసులు అందుకున్నవారిలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి సైతం ఉన్నారు. పోలీసులు రాఘవ రెడ్డి ఇంటికి వెళ్లగా అతడు పరారీలో ఉండటంతో అతడికోసం గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో కొడాలి నాని చంద్రబాబు, లోకేష్ లను మీడియాలో, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారని ఏయూ లా కాలేజీకి చెందిన అంజన ప్రియ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక స్త్రీగా కొడాలి నాని బూతుల పురాణాన్ని సహించలేకపోయానని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాకపట్నం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఐ రమణయ్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేశారు. ఇక ఇప్పటికే అందుతున్న ఫిర్యాదులతో ఒక్కొక్కరిని జైలుకు పంపుతున్న పోలీసులు మాజీ మంత్రి కొడాలిని సైతం అరెస్ట్ చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. ఒకవేళ కొడాలి నాని అరెస్ట్ అయితే ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది.