Himani Narwal Murder case: హర్యానాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త కొత్త ఆధారాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే నిందితుడ్ని అరెస్టు చేశారు. కాకపోతే హిమానీ హత్యకు గురైన రోజు బయటపడిన సీసీటీవీ దృశ్యాలు ఆసక్తి రేపుతున్నాయి. హిమానీ హత్య వెనుక ఎవరైనా ప్లాన్ చేశారా? దీని వెనుక అసలేం జరిగింది? అనే గుట్ట ఛేదించే పనిలో పోలీసులు పడ్డారు.
కాంగ్రెస్ కార్యకర్త హత్య
హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని బస్టాండ్ సమీపంలో మార్చి ఒకటిన ఖాళీ ప్రాంతంలో సూట్‌కేసు కనిపించింది. తొలుత దాని వద్దకు వెళ్లేందుకు చాలామంది భయపడ్డారు. చివరకు సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సూట్ కేసును ఓపెన్ చూశారు. అందులో మహిళా మృతదేహం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆమెని గుర్తించారు. చివరకు పేరు హిమానీ నర్వాల్.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సోమవారం సచిన్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. హిమానీని తాను హత్య చేసినట్టు పోలీసుల ముందు అంగీకరించాడు. కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం మాత్రం వెంటాడుతోంది. నిందితుడు ఇచ్చిన విచారణపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు.
హిమానీ హత్యకు గురైన రోజు ఆమె నివాసం నుంచి నిందితుడు సూటు కేసును తీసుకుని బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. హిమానీ నివాసం వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు.
ALSO READ: కలహాల కాపురం.. హైదరాబాద్‌లో టెక్కీ సూసైడ్
హత్య జరిగిన రోజు రాత్రి
ఫిబ్రవరి 28న రాత్రి దాదాపు 10 గంటలకు హిమానీ నివాసం సమీపం నుంచి అతడు వెళ్లడం గుర్తించారు. మరుసటి రోజు ఉదయం అదే సూట్‌కేసులో ఆమె మృతదేహం కనిపించింది. ఆమెతో తనకు సన్నిహిత సంబంధం ఉందని నిందితుడి మాట. తనను తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతో హత్య చేసినట్టు విచారణలో బయటపెట్టాడు. తాము స్నేహితులని, నిందితుడికి ఇప్పటికే వివాహమైందన్నది నిందితుడి వెర్షన్.
మృతురాలు హిమానీ నర్వాల్ తల్లిదండ్రుల విషయానికొద్దాం. తన కుమార్తె రాజకీయంగా ఎదుగుదల చూడలే క హత్య చేశారని అంటున్నారు. సొంత పార్టీకే చెందినవారు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మృతురాలి తల్లి ఆరోపించింది. హిమానీ హత్యపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చివరిసారి ఫిబ్రవరి 27న తన కూతురుతో మాట్లాడినట్లు వెల్లడించింది ఆమె తల్లి సవితా నర్వాల్.
హిమానీ గడిచిన పదేళ్లుగా కాంగ్రెస్‌తో మాంచి అనుబంధం ఉంది. స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలను కుందని, కొందరు వ్యక్తులు ఆమెని ఇబ్బందిపెట్టాలని చూశారని చెప్పుకొచ్చారు ఆమె తల్లి. కొన్ని విషయాలు తనతో హిమానీ పంచుకునేదని గుర్తు చేశారు. తన కూతురు చనిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని సంప్రదించలేదని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్రలో హిమానీ
బహుశా తన కూతుర్ని హత్య చేసేందుకు ముందుగానే స్కెచ్ వేశారని తన ఆవేదనను బయటపెట్టింది. తన కుమార్తెను చంపిన వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది కన్న తల్లి. హిమానీ నర్వాల్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించిన భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీతో కలిసి నడిచారామె.